మూడురోజుల్లో రెండోసారి: ఢిల్లీ షహీన్ బాగ్ వద్ద కాల్పుల మోత.. నిందితుడి పట్టివేత.. !
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని షహీన్ బాగ్ ప్రాంతం మరోసారి తుపాకీ కాల్పుల మోతతో మారుమోగిపోయింది. మూడురోజుల కిందటే ఉత్తర ప్రదేశ్ గౌతమబుద్ధ నగర్ జిల్లా జెవర్ ప్రాంతానికి చెందిన రామ్‌భక్త్ గోపాల్ శర్మ.. కాల్పులు జరిపిన సంఘటనను విస్మరించకముందే అలాంటి ఉదంతమే శనివారం చోటు చేసుకుంది. ఈ తాజా ఘటనలో ఎవరూ గాయపడలేదు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. అతని వద్ద నుంచి తుపాకీ, కొన్ని బుల్లెట్లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశీయంగా తయారైన నాటు తుపాకీని అతను వినియోగించినట్లు చెబుతున్నారు.
షహీన్ బాగ్ వద్ద గాలిలోకి మూడు రౌండ్లు..
దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు వ్యతిరేకంగా వందలాది మంది విద్యార్థులు, నిరసనకారులు కిందటి నెల 26వ తేదీ నుంచి షహీన్ బాగ్ వద్ద ప్రదర్శనలను నిర్వహిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఆందోళనకారులను చెదరగొట్టడానికి శనివారం మధ్యాహ్నం ఓ యువకుడు షహీన్ బాగ్ వద్ద గాలిలోకి కాల్పులు జరిపాడు. మూడు రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికే అతను ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారించారు.
కపిల్ గుర్జర్‌గా నిర్ధారణ..
అతణ్ని కపిల్ గుర్జర్‌గా గుర్తించారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలోని డల్లూపూర్‌కు చెందిన యువకుడిగా నిర్ధారించారు. కాల్పులు జరిపిన యువకుడిని తొలుత ఆందోళనకారులు తమ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతణ్ని అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసుల చేతికి అప్పగించారు. కపిల్ గుర్జర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు షహీన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతణ్ని విచారిస్తున్నారు. నిందితుడు తమ అదుపులోనే ఉన్నాడని ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ చిన్మయ్ బిశ్వాల్ తెలిపారు. అతణ్ని ఇంటరాగేట్ చేస్తున్నామని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

మూడు రోజుల్లో రెండోసారి.. కాల్పుల ఉదంతం..
మూడు రోజుల కిందటే ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రామ్‌భక్త్ గోపాల్ శర్మ.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మహా ప్రదర్శనను చేపట్టిన జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒక విద్యార్థి గాయపడ్డాడు. ప్రస్తుతం అతను పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఈ ఘటన రాజకీయంగా ప్రకంపనలను పుట్టించింది. ఇది సద్దుమణగక ముందే కపిల్ గుర్జర్ అనే యువకుడు ఏకంగా మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరపడం స్థానికింగా భయోత్పాతాన్ని సృష్టించింది. ఉద్దేశపూరకంగానే అతను ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications