అకౌంట్లోకి పొరబాటున 5.5 లక్షలు- ఖర్చు చేసేసి బ్యాంకుకు షాక్-మోడీ ఈఎంఐ పంపారంటూ..
కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చే సమయంలో ప్రధాని మోడీ తాను పగ్గాలు చేపట్టగానే విదేశాల్లో నల్లధనం తీసుకొచ్చి ప్రతీ భారతీయుడి ఖాతాలో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తానని ప్రగల్భాలు పలికారు. ఈ విషయం జనం మనసుల్లో ఎంతగా నాటుకుపోయిందంటే తాజాగా బీహార్లో జరిగిన ఓ ఘటన దీన్ని మరోసారి గుర్తు చేసింది. పొరబాటున తన ఖాతాలో బ్యాంకు బదిలీ చేసిన భారీ మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు సదరు ఖాతాదారులు నిరాకరిస్తున్నాడు. అదేమని అడిగితే ప్రధాని మోడీ ఇచ్చారంటున్నాడు. దీంతో బ్యాంకు అధికారులకు దిమ్మదిరిగిపోతోంది.

ప్రధాని మోడీ హామీ
కేంద్రంలో అధికారంలోకి వచ్చే క్రమంలో ప్రధాని మోడీ విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి ప్రతీ భారతీయుడి ఖాతాల్లోకి దాన్ని బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు. ఏడేళ్ల క్రితం ఇచ్చిన ఈ హామీ ఏనాడో మూలనపడిపోయింది. దీనిపై మరోసారి మాట్లాడేందుకు ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలెవరూ సాహసించని పరిస్ధితి. దీంతో ఆ హామీ గుర్తున్న వాళ్లు మాత్రం అధికారులతో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా నగదు లావాదేవీలు జరిగే బ్యాంకుల వద్ద ఈ హామీ అప్పుడప్పుడూ ప్రస్తావనకు వస్తూనే ఉంది. తాజాగా బీహార్లోనూ అదే జరిగింది.

ఖాతాలోకి పొరబాటున రూ.5.5 లక్షలు
బీహార్లోని ఖగారియా జిల్లాలోని గ్రామీణ బ్యాంకులో ఓ ఖాతాదారుడు ఉన్నాడు. అతని ఖాతాలో తాజాగా రూ.5.5 లక్షల మొత్తం వచ్చిపడింది.. ముందు ఈ విషయం నిజమో కాకో అర్ధంకాక గందరగోళానికి గురైన అతను ఆ చర్వాత బ్యాంకు అధికారులకు విషయాన్ని తెలిసి, ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకున్నాక నిజమని నమ్మాడు. ఇంతకీ ఇంత భారీ మొత్తం ఎందుకు తన ఖాతాలో పడిందో కూడా అతనికీ తెలియదు. అతను చుట్టుపక్కల వారికి కూడా తెలియదు. కేవలం ఈ విషయం బ్యాంకుకు మాత్రమే తెలుసు. దీంతో బ్యాంకు అధికారులు ఎలా స్పందించారో తెలుసా..

తిరిగి ఇమ్మన్న బ్యాంకు అధికారులు
బీహార్ లోని గ్రామీణ బ్యాంక్ ఖాతాదారుడి ఖాతాలో రూ.5.5 లక్షలు సదరు బ్యాంక్ పొరబాటు వల్ల పడినట్లు తర్వాత నిర్ధారణ అయింది. మరో ఖాతాకు బదిలీ చేయబోయి ఇతని ఖాతాకు పొరబాటున ఇంత మొత్తం జమ అయినట్లు తెలుసుకున్నారు. జరిగిన తప్పు తెలుసుకుని అతని ఖాతా వివరాల ఆధారంగా సంప్రదించారు. ఆ మొత్తాన్ని తిరిగి ఇమ్మని అతనిని కోరారు. తమంతట తామే ఈ మొత్తం వెనక్కి తీసుకునే వీలున్నా నిబంధనలు మాత్రం అంగీకరించవు. దీంతో మర్యాదగా ఈ మొత్తం వెనక్కి ఇచ్చేయాలని తనను కోరారు.

మోడీ ఫస్ట్ ఈఎంఐ పంపారంటూ షాక్
తన ఖాతాలో పొరబాటున రూ.5.5 లక్షలు పడ్డాయని, వాటిని తక్షణం వెనక్కి ఇచ్చేయాలంటూ బ్యాంకు అధికారులు కోరగా.. వారికి సదరు ఖాతాదారుడు షాకిచ్చాడు. ఈ మొత్తాన్ని తాను వెనక్కి ఇవ్వబోనని తేల్చిచెప్పేశాడు. ప్రధాని మోడీ గతంలో అధికారంలోకి రాగానే ఒక్కో ఖాతాలో రూ.15 లక్షల చొప్పున వేస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు అందులో తొలి వాయిదా కింద ఈ రూ.5.5 లక్షలు ఇచ్చారని అధికారులతో వాదనకు దిగాడు. దీంతో బ్యాంకు అధికారులకు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. మోడీ పంపారంటూ మార్చిలో అకౌంట్ లో పడిన ఈ మొత్తాన్ని ఖాతాదారుడు ఖర్చు కూడా చేసేశాడు. దీంతో ఆ మొత్తం ఎలా రికవరీ చేయాలో తెలియక అధికారులు తలపట్టుకుంటున్నారు.












Click it and Unblock the Notifications