మంత్రి అధికారిక నివాసానికి నిప్పుపెట్టిన దుండుగులు: మణిపూర్‌లో మళ్లీ కలకలం
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం చెలరేగిన హింసలో 9 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. తాజాగా, కొందరు దుండగులు లాంఫెల్ ప్రాంతంలోని పరిశ్రమల శాఖ మంత్రి నెమ్చా కిప్జెన్ అధికారిక నివాసానికి నిప్పుపెట్టారు. అయితే, ఆ సమయంలో మంత్రి తన నివాసంలో లేరని భద్రతా సిబ్బంది తెలిపారు.
ఈ ఘటనకు కారణమైన వారి కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఆ ప్రాంతంలో జల్లెడపడుతున్నాయి. కాగా, గత కొద్ది రోజులుగా మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈరోజు చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు ఆ ప్రయత్నాలను దెబ్బతీశాయి.

బుధవారం జరిగిన కాల్పుల్లో ఓ మహిళతోపాటు తొమ్మిది మంది మరణించడం గమనార్హం. పలువురు గాయపడ్డారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఖమెన్‌లక్ ప్రాంతంలో మళ్లీ ఘర్షణలు చెలరేగడం ఆందోళనకరంగా మారింది.
ఉగ్రవాదులు, గ్రామ వాలంటీర్ల మధ్య సోమవారం రాత్రి వరకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల కారణంగా తొమ్మిది మంది మృతి చెందారని, ఐదుగురు గాయపడ్డారని సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. గాయపడినవారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా, చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో కర్ఫ్యూ అమలు సమయం పెంచారు. ఆంక్షల సడలింపులకు కోతపెట్టారు.
ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మణిపూర్ రాష్ట్రంలో పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించిన విషయం తెలిసిందే. రాష్ట్ర మంత్రులు, అధికారులతోపాటు ఆయా వర్గాల ప్రతినిధులతోనూ సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి పరిస్థితులు నెలకొనేందుకు అందరూ సహకరించాలని కోరారు. దీంతో కొందరు ఆయుధాలు ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. అయితే, ఆ తర్వాత కొద్ది రోజులకే మళ్లీ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకర పరిస్థితులకు దారితీసింది.












Click it and Unblock the Notifications