ఓట్ల కోసం తప్పట్లే: స్టెప్పులేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
ఇంఫాల్: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మణిపూర్‌లో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ఈ ఈశాన్య రాష్ట్రంలో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు సన్నాహాలను పూర్తి చేశారు. ఈ నెల 27వ తేదీన తొలి విడత పోలింగ్‌ను షెడ్యూల్ చేశారు. వచ్చేనెల 3వ తేదీన రెండో దశ పోలింగ్ ఉంటుంది. ఈ రెండు దశల్లోనూ ఉత్తర ప్రదేశ్‌లో అయిదు, ఆరు విడతల పోలింగ్ ఉంటుంది.
మణిపూర్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ నెల 28వ తేదీన తొలి విడతలో 38 స్థానాలు, వచ్చేెనెల 5వ తేదీన మలి దశలో 22 సీట్ల పరిధిలో పోలింగ్ ప్రక్రియను నిర్వహించేలా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 20, 56, 901 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికోసం మొత్తం 2,950 పోలింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకుని రానున్నారు ఎన్నికల అధికారులు.

ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. 2017లో జరిగిన ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ 37 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ-28, నాగా పీపుల్స్ ఫ్రంట్-4, నాగా పీపుల్స్ పార్టీ-5 స్థానాలను సాధించాయి. కాంగ్రెస్ 13 సీట్లతో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఒక్క స్థానంలో జనతాదళ్ (యునైటెడ్) అభ్యర్థి విజయం సాధించారు. వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ సర్వశక్తులనూ ఒడ్డుతోంది.
కాగా- పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ మద్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ రెండు పార్టీలు కూడా తమ స్టార్ క్యాంపెయినర్లను ప్రచార బరిలో దింపాయి. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. ఇవ్వాళ మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంఫాల్ తూర్పు ప్రాంత పరిధిలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లారు. బీజేపీని మరోసారి గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు.
#WATCH | Union Minister Smriti Irani joins artists performing traditional dance at an event in Wangkhei area of Imphal East, Manipur pic.twitter.com/jQtqKMkOJW
— ANI (@ANI) February 18, 2022
ఈ సందర్భంగా ఆమె వాంగ్ఖేయ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం అక్కడే- స్థానిక మహిళలతో కలిసి మణిపూర్ సంప్రదాయబద్ధమైన నృత్యంలో పాల్గొన్నారు. వారితో కలిసి లయబద్ధంగా స్టెప్పులేశారు. వారిని ఉత్సాహ పరిచారు. సాక్షాత్తూ కేంద్రమంత్రి తమతో కలిసి డాన్స్ చేయడానికి రావడంతో వారు మరింత ఉత్సాహంతో డాన్స్ చేశారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి సాధారణంగా ఆయా పార్టీల నాయకులు, అభ్యర్థులు స్థానికులతో ఇలా మమేకం కావడం సర్వ సాధారణమే.












Click it and Unblock the Notifications