‘గాజులకు, చేతగానితనానికి సంబంధం ఏంటి?’: మోడీకి యువతి లేఖ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ గిరిజన యువతి సూటి ప్రశ్న సంధించింది. సదరు లేఖాస్త్రాన్ని ఆమె జనానికి తెలిసేలా ప్రధాని ట్విట్టర్ ఖాతాలోనూ పోస్ట్ చేసింది. మహిళల చేతులకు ఆభరణాలుగా ఉంటున్న గాజులు... చేతకాని పురుషులు ధరించాలంటూ చేస్తున్న వ్యాఖ్యలను నిషేధించాలంటూ ఆమె ఆ లేఖలో ప్రధానిని డిమాండ్ చేసింది.
ఛత్తీస్ గఢ్ లోని జష్పూర్ జిల్లా కన్సాబెల్‌కు చెందిన గిరిజన యువతి సౌమ్య గార్గ్ ఈ మేరకు ప్రశ్నించింది. 'గాజుల' విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధానికి లేఖ రాసింది.

'మా మనసులోని మాట ఎవరితో చెప్పుకోవాలి?(మన్ కీ బాత్ మై కిస్ సే కరూ)'' అనే ప్రారంభ వాక్యంతో లేఖను రాసిన ఆమె, మహిళలు గాజులు తొడుక్కోవడానికి, చేతకాని పురుషులను గాజులు తొడుక్కోమనడానికి సంబంధం ఏముందని ప్రశ్నించింది.
'నువ్వేం చేయలేకపోతే గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చో అంటూ పురుషులను ఉద్దేశిస్తూ ఇటీవల పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలకు మహిళల గాజులకు ఏమిటి సంబంధం?' అంటూ ఆమె తన లేఖలో ప్రశ్నించింది. ఆ వ్యాఖ్యలపై నిషేధం విధించాలని కోరింది.
ఈ వ్యాఖ్యలు అవమానం కలిగించేలా ఉన్నాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు గౌరవం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా, దీనిపై ప్రధాని మోడీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications