భారత్ నుంచి మరిన్ని వ్యాక్సిన్లు -WEF's Davos Dialogueలో ప్రధాని మోదీ
కరోనా టీకాల పంపిణీలో ముందంజలో ఉన్న భారత్.. ఇప్పటికే ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లను అందిస్తున్నదని.. త్వరలోనే భారత్ గడ్డ నుంచి మరిన్ని కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దావోస్‌లో జరుగుతోన్న'వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్' సమావేశాన్ని ఉద్దేశించి ఆయన గురువారం ప్రసంగించారు.
''కోవిడ్‌కు సంబంధించి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాం. మానవ వనరులను కూడా అలాగే అభివృద్ధి చేసుకుంటున్నాం. కోవిడ్‌ను గుర్తించడానికి, కోవిడ్ పరీక్షకు అవసరమైన సాంకేతికతను కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం. భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. కేవలం 12 రోజుల వ్యవధిలోనే 23 లక్షల మంది హెల్త్ వర్కర్లకు, కొవిడ్ వారియర్లకు టీకాలను అందించాం. అదే సమయంలో ప్రపంచం అవసరాలను గుర్తిస్తూ..

ఇప్పటి వరకూ 150 దేశాలకు ఆవశ్యకమైన ఔషదాలను పంపిణీ చేశాం. దీన్ని ప్రపంచం పట్ల, మానవాళి పట్ట భారత్ బాధ్యతగా భావిస్తున్నాం. నిజానికి కరోనా వల్ల భారత్ ఘోరంగా దెబ్బతింటుందని, కనీసం 20 లక్షల మంది చనిపోతారని అంచనాలు వేశారు. కానీ అందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, అంచనాలను తలకిందులు చేశాం. భారత్ లో కరోనాపై పోరాటాన్ని ప్రజల ఉద్యమంగా మార్చేశాం..
కోవిడ్‌ను జయించే విషయంలో భారత్‌ను ఏ దేశంతో పోల్చడం అంత సముచితం కాదు. ప్రపంచ జనాభాలో 18 శాతం ఉన్న భారత్... మహమ్మారిని నియంత్రించి మానవాళిని కాపాడింది. కరోనా తొలినాళ్లలో మాస్కులు, పీపీఈ కిట్లు, శానిటైజర్లను ఇతర దేశాల నుచి దిగుమతి చేసుకున్న మేము.. ఇప్పుడు దేశీ అవసరాలను తీర్చుతూనే, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తూ ప్రజాసేవ చేస్తున్నాం''అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications