భారీ ఎన్ కౌంటర్: మావోయిస్టు అగ్రనేతతోపాటు 12 మంది మృతి
గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో బుధవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని వండోలి గ్రామం సమీపంలో 12 నుంచి 15 మంది మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందడంతో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో డీఎస్పీ సారథ్యంలో భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించాయి.
ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య బుధవారం మధ్యాహ్నం భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురుకాల్పులు కొనసాగాయి. దాదాపు ఆరు గంటలపాటు కొనసాగిన ఈ ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు అధికారులు తెలిపారు.

మృతుల్లో మావోయిస్టు అగ్రనేత లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఆత్రం ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మిగితా మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు, ఈ ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో అతడ్ని నాగ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు.
ఎన్‌కౌంటర్ అనంతరం ఘటనా స్థలం నుంచి 12 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు ఉపయోగించిన 3 ఏకే-47లు, 2 ఇన్సాస్ రైఫిళ్లు, కార్బైన్, ఎస్‌ఎల్‌ఆర్ సహా ఏడు ఆటోమోటివ్ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు గడ్చిరోలి ఎస్పీ తెలిపారు. కాగా, మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. సీ60 కమాండో బృందాలు, గడ్చిరోలి పోలీసులకు రూ.51 లక్షల రివార్డు ప్రకటించారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.












Click it and Unblock the Notifications