ఆర్కే నగర్‌పై శశికళ బడా ప్లాన్.. సీఎంగా..: పళనిస్వామికి కూడా చెక్!
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత పళనిస్వామి మరో పన్నీరు సెల్వం కానున్నారా? అంటే అవుననే అంటున్నారు. ఇంకా చెప్పాలంటే పన్నీరు.. అమ్మ జయలలిత కోసం సీఎం పగ్గాలు చేపట్టి, ఆ తర్వాత ఆమె చేతిలో పెట్టేవారు.
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత పళనిస్వామి మరో పన్నీరు సెల్వం కానున్నారా? అంటే అవుననే అంటున్నారు. ఇంకా చెప్పాలంటే పన్నీరు.. అమ్మ జయలలిత కోసం సీఎం పగ్గాలు చేపట్టి, ఆ తర్వాత ఆమె చేతిలో పెట్టేవారు.
పళనిస్వామి పరిస్థితి అంతకంటే దారుణం అనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు రెండుసార్లు తనకు విశ్వాసపాత్రుడైన పన్నీరును ఆ సీట్లో కూర్చోబెట్టారు. ఆమె తిరిగి వచ్చాక.. అంతే వినమ్రతతో పదవిని అప్పగించారు.

పళనిస్వామి సీఎం అయినా..
ఇప్పుడు పన్నీరు - శశికళల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తాను జైలుకు వెళ్లే పరిస్థితి రావడంతో.. పన్నీరుకు షాకిస్తూ.. సీఎంగా పళనిస్వామిని శశికళ తెరపైకి తెచ్చారు. ఇప్పుడు శశికళ జైలులో ఉన్నారు. పళని సీఎం అయ్యారు.

శశికళ అనర్హత
జైల్లో ఉన్న శశికళ పదేళ్ల పాటు పోటీకి అనర్హులు. దీంతో పళనిస్వామిని సీఎం చేశారు. కానీ ఆయనను శశికళ ఎక్కువ కాలం ఆ సీట్లో కూర్చుండబెట్టే పరిస్థితులు లేవని అంటున్నారు. జైలు శిక్ష పడగానే.. ఆమె తన అక్క కొడుకు దినకరన్ చేతిలో పార్టీ పగ్గాలు పెట్టారు.

రెండూ కుటుంబం చేతిలోనే..
పార్టీని, ప్రభుత్వాన్ని తన కుటుంబం చేతులోనే ఉంచుకోవడానికి శశికళ ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలో పార్టీని దినకరన్ చేతిలో పెట్టిన శశికళ.. ఆ తర్వాత ప్రభుత్వ పగ్గాలు కూడా ఆయనకే అప్పగించే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు.

ఆర్కే నగర్ ప్లాన్.. పళనికీ చెక్
జయలలిత మృతి నేపథ్యంలో ఆర్కే నగర్ నియోజకర్గంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడి నుంచి దినకరన్‌ను పోటీ చేయించి.. ఆ తర్వాత కొన్నాళ్లకు సీఎంగా ఆయనను చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అంటే, తనకు అర్హత లేకపోవడంతో.. పళనిస్వామిని పక్కన పెట్టి (చెక్ చెప్పడమే) దినకరన్‌కు పార్టీతో పాటు ప్రభుత్వ పగ్గాలు అప్పగించే యోచనలో శశికళ ఉన్నారని చెబుతున్నారు.

జయలలిత మృతితో అంతా రివర్స్
జయలలిత మృతి అనంతరం తమిళనాడులో.. ముఖ్యంగా అధికార అన్నాడీఎంకేలో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్న విషయం తెలిసిందే. అది చివరకు పన్నీరు వర్సెస్ శశికళగా మారింది. ఇప్పుడు ఇరువురు కూడా పార్టీ పైన పట్టు కోసం పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో శశికళ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

సీఎం పీఠంపై..
సీఎం పీఠంపై పన్నీరు కూర్చున్నారు. ఆ తర్వాత శశికళ కోసం రాజీనామా చేశారు. కానీ మూడు రోజుల్లోనే ఆయన తిరుగుబాటు చేశారు. అప్పటి నుంచి పరిణామాలు మరింత ఆసక్తిని కలిగించాయి. ఆ తర్వాత శశికళ జైలుకు వెళ్లడం.. పార్టీ పగ్గాలు దినకరన్‌క అప్పగించడం, సీఎంగా పళనిస్వామిని ఎంపిక చేయడం వేగంగా జరిగిపోయాయి. మొత్తానికి తనను ఎదిరించిన పన్నీరుకు చెక్ చెప్పేందుకు శశికళ పావులు కదిపారు. అసెంబ్లీలో పళని బలనిరూపణ సమయంలో హైడ్రామా చోటు చేసుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications