మాయావతికి పద్మవిభూషణ్, అసదుద్దీన్ ఒవైసీకి భారతరత్న: బీజేపీని గెలిపించారుగా
ముంబై: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జైత్రయాత్ర కొనసాగింది. పంజాబ్ మినహా మిగిలిన నాలుగు చోట్లా ఘన విజయాన్ని అందుకుంది. తన నాలుగు రాష్ట్రాలను తాను నిలబెట్టుకోగలిగింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిందా పార్టీ. పంజాబ్‌లో తన హవాను కొనసాగించలేకపోయింది. అక్కడ కాంగ్రెస్‌కు బదులుగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం కనిపించింది.
ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ వరుసగా రెండోసారి తిరుగులేని విజయాన్ని సాధించడం- ఆ పార్టీకి సరికొత్త ఊపు, ఉత్సాహాన్ని ఇచ్చింది. మిగిలిన రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం బోనస్‌గా భావిస్తోన్నారు కమలనాథులు. ఉత్తరాఖండ్‌లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు ఉంటుందని అంచనా వేసినప్పటికీ అవి తలకిందులయ్యాయి. ఇక్కడ బీజేపీ విజయం నల్లేరు మీద నడకే. మణిపూర్‌లో పూర్తిస్థాయి మెజారిటీని సాధించింది. గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలానికి బీజేపీ ఒక్క సీటు దూరంలో ఆగింది.

ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ గెలుపు పట్ల శివసేన పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓ గొప్ప విజయాన్ని సాధించిందనందుకు శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకుందే తప్ప కొత్తగా సాధించింది కాదని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్.. తన సీట్ల సామర్థ్యాన్ని మూడురెట్లు పెంచుకోగలిగారని అన్నారు. ఇదివరకు 42 స్థానాలకే పరిమితమైన సమాజ్‌వాది పార్టీ ఇప్పుడు 125కు చేరిందని శివసేన చెప్పారు.
ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయాన్ని సాధించడానికి బహుజన్ సమాజ్‌వాది పార్టీ అధినేత్రి మాయావతి, అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక పాత్ర పోషించారని అన్నారు. వారిద్దరికీ పద్మవిభూషణ్, భారతరత్న ఇవ్వాల్సిందేనని సెటైర్లు సంధించారు. పంజాబ్‌లో ఎందుకు బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఇలా కీలక నేతలు ప్రచారం చేసినా ఒరిగిందేమీ లేదని అన్నారు.
Recommended Video
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఇదివరకే బీజేపీ అధికారంలో ఉందని, అక్కడ గెలవడం కంటే పంజాబ్‌లో ఎందుకు ఓడిపోయిందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సంజయ్ రౌత్ అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్, శివసేనల కంటే ఘోరంగా పంజాబ్‌లో బీజేపీ మట్టికరిచిందని చెప్పారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధమీ, గోవాలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, ఉత్తర ప్రదేశ్‌లో కేశవ్ ప్రసాద్ మౌర్య ఎలా ఓడారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications