అమిత్ షాకు మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా ఫోన్: బీజేపీతో కలిసి ఎన్పీపీ ప్రభుత్వం
మేఘాలయలో మరోసారి ఎన్పీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
న్యూఢిల్లీ: మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాలు దక్కించుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే, అధికారం చేపట్టేందుకు మాత్రం కొన్ని స్థానాలు తక్కువయ్యాయి. దీంతో పాత మిత్రుడు బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు కన్రాడ్ సంగ్మా.
ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. మేఘాలయలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు మద్దతు ఇవ్వాలని అమిత్ షాను సంగ్మా కోరారు. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం కూడా సంగ్మా పార్టీకి మద్దతు తెలపాలని రాష్ట్ర పార్టీ బాధ్యులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు కలిగివున్న మేఘాలయలో అధికారం చేపట్టాలంటే 31 సీట్లు రావాల్సి ఉంది. అయితే, కన్రాడ్ నేతృత్వంలోని ఎన్పీపీకి 27 సీట్లు రాగా, బీజేపీ రెండు స్థానాల్లో గెలిచింది. బీజేపీతోపాటు స్వతంత్రుల మద్దతుతో మేఘాలయాలో మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు సంగ్మా ప్రయత్నాలు ప్రారంభించారు.
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి దూరం జరిగారు సంగ్మా. అప్పటి వరకు బీజేపీ మద్దతుతో ఆయన సీఎంగా కొనసాగారు. సంగ్మా పార్టీ, బీజేపీలు ఈ ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేశారు. దీంతో మెజార్టీ ఏ పార్టీకి రాకుండా పోయింది. ఈ క్రమంలో మళ్లీ అధికారం చేపట్టేందుకు సీఎం సంగ్మా బీజేపీ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు.
అయితే, ఎగ్జిట్స్ పోల్స్ ఫలితాల్లో మేఘాలయాలో హంగ్ ఏర్పడుతుందని తేలడంతో ఇప్పటికే అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మతో కన్రాడ్ సంగ్మా భేటీ అయ్యారు. ఒకవేళ తక్కువ సీట్లు వస్తే బీజేపీతో కలిసి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీరిద్దరూ చర్చించారు. కాగా, 2018లో కూడా బీజేపీ రెండు స్థానాల్లోనే గెలిచింది. అయితే, ఎన్పీపీతో కలిసి మేఘాలయాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు కూడా అదే జరగనుంది.
ఎన్పీపీకి మద్దతిస్తామన్న మేఘాలయ బీజేపీ చీఫ్
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎన్‌పీపీకి మద్దతు ఇవ్వాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నుండి నాకు ఈ రోజు పిలుపు వచ్చింది. సీఎం కన్రాడ్ సంగ్మాతో మాట్లాడి పార్టీ నిర్ణయాన్ని తెలియజేశాను. నేను ఆయనను కలుస్తాను. ఈ రాత్రి మద్దతు లేఖను సమర్పిస్తాను: మేఘాలయ బీజేపీ అధ్యక్షుడు ఎర్నెస్ట్ మావ్రీ.












Click it and Unblock the Notifications