ఆమె నా భర్త ప్రియురాలు కాదు: మెహుల్ చోక్సీ భార్య ప్రీతి చోక్సీ, గాయాలపై ఆవేదన
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) స్కామ్ కేసులో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ తన ప్రియురాలితోపాటు డొమినికాలో అక్కడి పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. డొమినికాకాకు ఆయన వెంట వెళ్లిన మహిళ అతని ప్రియురాలు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మెహుల్ చోక్సీ సతీమణి ప్రీతి చోక్సీ స్పందించారు.

ఆమె మెహుల్ చోక్సీ ప్రియురాలు కాదన్న భార్య ప్రీతి
ప్రియురాలిగా ప్రచారం జరుగుతున్న సదరు మహిళ తన భర్తకు తెలిసిన వ్యక్తి మాత్రమేనని అని, ప్రియురాలు కాదని ప్రీతి చోక్సీ స్పష్టం చేశారు. చోక్సీ వెంట ఉన్న మహిళ ఆయనతోపాటు అతడి స్నేహితులకు కూడా తెలుసని తెలిపారు. అంటిగ్వాను సందర్శించిన సందర్భాల్లో చోక్సీతో వాక్ చేస్తుంటుందని అన్నారు. అయితే, చోక్సీతో నడిచిన మహిళ, మీడియా చానళ్లలో చూపిస్తున్న మహిళ ఒకరు కాదని ప్రీతి తెలిపారు.

ప్రియురాలితో విందుకు మెహుల్ చోక్సీ అంటూ ప్రధాని..
కాగా, మెహుల్ చోక్సీ తన ప్రియురాలితో కలిసి విందు కోసం డిమినికా వెళ్లి ఉంటాడంటూ అంటిగ్వా-బార్బుడా ప్రధాని గస్టన్ బ్రౌనే ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయంలో మీడియాలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే మెహుల్ చోక్సీ భార్య ప్రీతి జోక్సీ స్పందించారు. మెహుల్ చోక్సీ ఒంటిపై గాయాలున్నట్లు మీడియాలో వార్తలు రావడంపైనా ఆమె స్పందించారు.

నా భర్తను ఎందుకలా హింసిస్తున్నారు: చోక్సీ భార్య ప్రీతి
తన భర్త విషయంలో మానవ హక్కులను విస్మరించి డొమినికా పోలీసులు హింసకు గురిచేయడం ఆవేదనకు గురిచేస్తోందని ప్రీతి చోక్సీ వ్యాఖ్యానించారు. చోక్సీని సజీవంగా రప్పించాలనుకున్నప్పుడు హింసించాల్సిన అవసరమేంటి? ఆయన్ను భౌతికంగా, మానసికంగా వేధించడం ఎందుకు? అని ఆమె ప్రశ్నించారు. తన భర్తకు పలు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు.

చోక్సీని భారత్ రప్పించే ప్రయత్నాలు ప్రారంభం
ఇది ఇలావుండగా, చోక్సీని భారత్ రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇందుకు అవసరమైన పత్రాలను ఓ ప్రైవేటు విమానంలో భారత్ పంపిందని అంటిగ్వా-బార్బుడా ప్రధాని గస్టన్ బ్రౌన్ ఇటీవల తెలిపారు. డొమినికా నుంచి నేరుగా భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు అంటిగ్వా-బార్బుడా ప్రభుత్వంతోపాటు డొమినికా కూడా సానుకూలంగా స్పందించాయి.
రూ. 13వేల కోట్ల పీఎన్బీ కుంభకోణం కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ప్రధాన నిందితుడు కాగా, అతడి మామ అయిన మెహుల్ చోక్సీ కూడా కీలక నిందితుడు. విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ ప్రస్తుతం లండన్ జైలులో ఉన్నారు. మరో స్కాం కేసులో నిందితుడైన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా కూడా విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications