మహారాష్ట్రలో కరోనా విజృంభణ: ముంబైలో 10వేల మార్క్ దాటిన కేసులు, పుట్టిన పాపకు కూడా..
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా ముంబై మహానగరంలో కరోనా ప్రభావం మరింత దారుణంగా ఉంది. మహారాష్ట్రలో బుధవారం ఒక్క రోజే 1233 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో అత్యధికంగా తొలిసారి..
ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసులతో పోల్చితే ఇదే అత్యధికం కావడం గమనార్హం. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 34 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 16,758కి చేరగా, ఇప్పటి వరకు 651 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

ముంబైలో 10వేలు దాటిన కేసులు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10వేల మార్కును దాటింది. బుధవారం ఒక్కరోజే కొత్తగా 769 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 10, 527కు చేరింది. తాజాగా 25 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 412కు చేరిందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ప్రకటించింది.
Recommended Video

అప్పుడే పుట్టిన పాపకు కరోనా.. ధారవిలోనూ కరోనా విజృంభణ
కాగా, నవీ ముంబైలో అప్పుడే పుట్టిన శిశువుకు కరోనా సోకింది. కరోనా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణీ ఓ పాపకు జన్మనిచ్చింది. పుట్టిన పాపకు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆ శిశువుకు కూడా చికిత్స అందిస్తున్నారు. ఇక ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారవిలో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ధారవిలో మొత్తం కేసుల సంఖ్య 733కి చేరగా, మరణాల సంఖ్య 21కి పెరిగింది. ఇక దేశ వ్యాప్తంగా 52,458 కేసులు నమోదు కాగా, 1777 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం 35,766 మంది ఆస్పత్రుల్లో చికత్స పొందుతుండగా, 14,911 మంది కోలుకున్నారు.












Click it and Unblock the Notifications