Madhya Pradesh: ప్రజల్లో అడుక్కునే అలవాటు పెరిగింది.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
Madhya Pradesh: మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ పటేల్ శనివారం ప్రజలు అందించే వినతిపత్రాలను 'యాచించడం'గా అభివర్ణించిన తర్వాత వివాదానికి దారితీసింది. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో వీరాంగన రాణి అవంతిబాయి లోధి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
మధ్యప్రదేశ్ పంచాయతీ, గ్రామీణాభివృద్ధి మంత్రి ప్రహ్లాద్ పటేల్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజలు ప్రభుత్వం నుంచి అడుక్కోవడం అలవాటు చేసుకున్నారని అన్నారు. నాయకులు వస్తే వినతిపత్రాలతో నిండిన బుట్టను అందజేస్తారని.. వేదికపై వారికి దండలు వేస్తారని.. వారి చేతుల్లో ఒక లేఖను ఉంచుతారని వ్యాఖ్యానించారు. ఇది మంచి అలవాటు కాదన్నారు. అడగడానికి బదులుగా ఇచ్చే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలన్నారు.

ఇది సంతోషకరమైన జీవితానికి దారి తీస్తుందని.. సంస్కారవంతమైన సమాజాన్ని నిర్మించడం సహాయపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఉచితాలపై అధికంగా ఆధారపడటం సమాజాన్ని బలోపేతం చేయడానికి బదులుగా బలహీనపరుస్తుందని ఆయన అన్నారు. ఈ యాచకుల సైన్యం సమాజాన్ని బలోపేతం చేయడం లేదని.. అది బలహీనపరుస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉచితాలకు ఆకర్షితులవడం అంటే ధైర్యవంతులైన అమరవీరులను గౌరవించడం కాదన్నారు. ఎప్పుడైనా అడుక్కున్న అమరవీరుడి పేరు చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు.
ప్రహ్లాద్ పటేల్ ప్రకటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతు పట్వారీ మంత్రిని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని అన్నారు. బీజేపీ అహంకారం ఎంత స్థాయికి చేరుకుందంటే.. వారు ఇప్పుడు ప్రజలను భిచ్చగాళ్లు అని పిలుస్తున్నారని విమర్శలు గుప్పించారు.
MP minister Prahlad Singh Patel's controversial speak. "People have become habitual of begging from government. Building army of beggars weakens society. Being attracted to freebies doesn't amount to respect to bravehearts-martyrs." @santwana99@NewIndianXpress@jayanthjacob pic.twitter.com/OazlfV8bWS
— Anuraag Singh (@anuraag_niebpl) March 2, 2025
కష్టాలతో పోరాడుతున్న వారి ఆశలు, కన్నీళ్లకు ఇది అవమానమన్నారు. వారు ఎన్నికలకు ముందు తప్పుడు వాగ్దానాలు చేసి .. వాటిని నెరవేర్చడానికి ఇప్పుడు నిరాకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలు వారి వాగ్దానాలను గుర్తు చేస్తే .. వారు సిగ్గు లేకుండా వారిని భిచ్చగాళ్లు అని పిలుస్తారని ఆరోపించారు. ప్రజలు ఇవన్నీ గుర్తుంచుకుంటారని.. బీజేపీ నాయకులు ఓట్లకోసం మళ్లీ అడుక్కుంటూ వస్తారని జీతు పట్వారీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications