వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరాబాయి చాను: నాడు వెదురుకర్రతో వెయిట్ లిఫ్టింగ్ చేసింది, నేడు రికార్డులు బద్ధలు చేస్తూ గోల్డ్ సాధించింది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

కామన్వెల్త్ గేమ్స్‌లో 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. స్నాచ్ రౌండ్ తర్వాత చాను 12 కిలోల భారీ ఆధిక్యం సాధించింది.

ఈసారి చాను మొదటి నుంచి పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించింది. ఆమె మొత్తం 201 కిలోల బరువులను ఎత్తింది. స్నాచ్‌లో 88 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 113 కిలోలను ఎత్తగలిగింది. ఈ విభాగంలో రికార్డు కూడా సృష్టించింది మీరాబాయి.

తొలి ప్రయత్నంలోనే 84 కిలోల బరువును ఎత్తిన చాను, రెండో ప్రయత్నంలో 88 కేజీలతో వ్యక్తిగత అత్యుత్తమ రికార్డును సమం చేసింది.

ఈ పోటీలో చాను మొదటి నుంచి గోల్డ్ మెడల్ సాధించే దిశగానే సాగింది. ఈ విభాగంలో స్నాచ్‌ గేమ్స్‌ రికార్డు కూడా ఇదే. మూడో ప్రయత్నంలో 90 కేజీల బరువు ఎత్తేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి రజత పతక విజేత. కామన్వెల్త్‌లో 49 కేజీల కేటగిరీలో ఆమె స్వర్ణం సాధిస్తారని మొదటి నుంచి భావించారు.

అంతకుముందు, శనివారంనాడు భారత్ పతకాల ఖాతా తెరిచింది. వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహదేవ్ శనివారం పురుషుల 55 కిలోల వెయిట్ విభాగంలో దేశానికి రజత పతకాన్ని అందించాడు.

ప్రధాని అభినందనలు

పతకం సాధించిన మీరా బాయి చానుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

"మీరాబాయి చాను మరోసారి భారతదేశం గర్వపడేలా చేశారు. బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో ఆమె కొత్త రికార్డు సృష్టించడంతోపాటు, బంగారు పతకం సాధించడం పట్ల ప్రతి భారతీయుడు సంతోషిస్తున్నాడు. ఆమె విజయం చాలామంది భారతీయులకు, ముఖ్యంగా వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం'' అని పేర్కొన్నారు.

https://twitter.com/narendramodi/status/1553428380019818496

హోంమంత్రి అమిత్ షా కూడా చానును అభినందిస్తూ ట్వీట్ చేశారు.

''వెయిట్ లిఫ్టింగ్‌లో భారతీయ వెయిట్ లిఫ్టర్లు దేశపు జెండాను రెపరెపలాడించారు. మీరాబాయి అద్భుతమైన సహనం, పట్టుదల ప్రదర్శించారు. మీ విజయానికి దేశం గర్విస్తోంది'' అని ఆయన ట్వీట్ చేశారు.

ప్రధాని, హోంమంత్రితో పాటు కేంద్ర ప్రభుత్వంలోని పలువురు మంత్రులు కూడా మీరబాయి చాను ను అభినందిస్తూ ట్వీట్‌లు చేశారు.

https://twitter.com/AmitShah/status/1553428941595373568

వరల్డ్ వెయిట్ లిఫ్టింట్ చాంపియన్‌షిప్ లోనూ స్వర్ణం

2017 ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మీరాబాయి తన బరువుకు దాదాపు నాలుగు రెట్లు అంటే 194 కిలోల బరువును ఎత్తి స్వర్ణం సాధించింది.

గత 22 ఏళ్లలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా మీరాబాయి నిలిచింది.

మీరాబాయి తన బరువును 48 కిలోల కన్నా పెరగకుండా ఉంచడానికి ఆ రోజు అన్నం కూడా తినలేదు. గేమ్‌కు సిద్ధమయ్యేందుకు మీరాబాయి అప్పట్లో తన సోదరి వివాహానికి కూడా హాజరుకాలేదు.

ఈ క్షణం కోసం 2016 నుంచి తపిస్తున్న మీరాబాయికి, పతకం సాధించిన తర్వాత కళ్ల వెంట నీరుకారాయి.

11 ఏళ్లకు అండర్-15 చాంపియన్‌గా, 17 ఏళ్లకు జూనియర్ చాంపియన్‌గా నిలిచింది మీరబాయి. వెయిట్ లిఫ్టర్ కుంజురాణి దేవిని చూసి, మీరాకు చాంపియన్ కావాలనే కోరిక కలిగింది. 2016లో మీరా 192 కిలోల బరువును ఎత్తి 12 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలుకొట్టింది.

2016 రియో ఒలింపిక్స్‌లో పేలవమైన ప్రదర్శన నుండి టోక్యో ఒలింపిక్స్‌లో పతకం వరకు చాను ప్రయాణం సాగింది.

చేతులు బిగుసుకుపోయిన వేళ

రియో ​​ఒలింపిక్స్‌కు వెళ్లినప్పుడు మీరాబాయి కథ వేరేలా ఉంది. ఒలింపిక్స్ వంటి మ్యాచ్‌లో ఇతర ఆటగాళ్ల కంటే వెనుకబడ్డారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ, గేమ్ ను పూర్తి చేయలేకపోతే అది ఏ ఆటగాడికైనా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే పరిణామం కావచ్చు.

2016లో మీరాబాయి చానుకి అదే జరిగింది. ఒలింపిక్స్‌లో మీరా తన విభాగంలో రెండో అథ్లెట్. కానీ, ఆమె పేరు ఒలింపిక్స్‌లో 'డిడ్ నాట్ ఫినిష్' విభాగంలో కనిపించింది.

మీరా రోజువారీ ప్రాక్టీస్‌లో తేలికగా బరువును ఎత్తగా, ఆ రోజు ఒలింపిక్స్‌లో ఆమె చేతులు బిగుసుకుపోయాయి. అప్పటికి భారతదేశంలో రాత్రి సమయం కావడంతో ఆ దృశ్యాన్ని చాలా తక్కువమంది చూశారు.

పత్రికల్లో ఈ వార్త రాగానే, క్రీడాభిమానుల దృష్టిలో మీరాబాయి విలన్‌గా మారారు. 2016 ఘటన తర్వాత ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడంతో కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సి వచ్చింది.

ఈ వైఫల్యం తర్వాత, ఒకదశలో మీరా ఆటకు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకుంది. కానీ, పట్టు వదలకుండా అంతర్జాతీయ పోటీల్లో పునరాగమనం చేసింది.

2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 48 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నఆమె, ఇప్పుడు మళ్లీ గోల్డ్ సాధించారు.

మీరాబాయి చాను

వెదురు కర్రతో వెయిట్ లిఫ్టింగ్

1994 ఆగస్టు 8న మణిపూర్‌లోని ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన మీరాబాయి, చిన్నప్పటి నుంచి ఆటల్లో చాలా ప్రతిభ చూపింది. ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు లేని ఆమె గ్రామం, రాజధాని ఇంఫాల్‌కు 200 కి.మీ దూరంలో ఉంటుంది.

అప్పట్లో మణిపూర్‌కు చెందిన కుంజురాణి దేవి వెయిట్‌లిఫ్టర్ స్టార్‌ పేరు సంపాదించారు. ఆమె ఏథెన్స్ ఒలింపిక్స్ గేమ్స్‌లో పాల్గొన్నారు.

కుంజురాణి దేవి ఆ పోటీల్లో పాల్గొన్న దృశ్యం చిన్నారి మీరా మనస్సులో చెరగని ముద్రవేసింది. ఆరుగురు సంతానంలో అందరికన్నా చిన్నదైన మీరాబాయి వెయిట్‌లిఫ్టర్‌గా మారాలని నిర్ణయించుకుంది.

మీరా పట్టుదల ముందు తల్లిదండ్రులు కూడా తలొగ్గాల్సి వచ్చింది. 2007లో ప్రాక్టీస్ ప్రారంభించినప్పుడు, బరువులు మోసేందుకు ఇనుప కడ్డీ లేకపోవడంతో వెదురు కర్రకు బరువులు కట్టి సాధన చేసింది.

తాను పుట్టిన గ్రామంలో ట్రైనింగ్ ఇచ్చేవారు లేకపోవడంతో అక్కడి నుంచి 50-60 కిలోమీటర్ల దూరం వెళ్లి శిక్షణ తీసుకుందామె.

క్రీడాకారులకు, ముఖ్యంగా వెయిట్ లిఫ్టర్లకు డైట్‌లో రోజూ పాలు, చికెన్ అవసరం. కానీ, పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు అవి తీసుకోవడం సాధ్యం కాలేదు. కానీ, ఆ లోపాన్ని ఏనాడు దరికి రానివ్వకుండా ఈ స్థాయికి చేరుకుంది మీరబాయి చాను.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Mirabai Chanu: Yesterday, she did weightlifting with a bamboo stick, broke records and won gold today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X