
అక్కడ మొబైల్ టవర్ చోరీ... షాకింగ్ దొంగతనాలకు ఆ రాష్ట్రం కేరాఫ్!!
బీహార్ దొంగలు బాగా ఫేమస్ అవుతున్నారు. వింత దొంగతనాలకు ఆ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్ గా మారింది. వీళ్లు చేస్తున్న చోరీలు అన్నీ ఇన్ని కావు. వింత వింత చోరీలను చేస్తూ అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో గతంలో ఓ బ్రిడ్జిని చోరీ చేసిన దొంగలు, ఆపై బీహార్ లోని యార్డులో రైల్వే ఇంజన్ విడిభాగాలను చోరీ చేసి సంచలనం సృష్టించారు. ఇక తాజాగా బీహార్లో మొబైల్ టవర్ ను చోరీ చేయడం ఒక్కసారిగా అందరినీ విస్మయానికి గురి చేసింది.
బీహార్లోని పాట్నాలో ఈ విచిత్రమైన దొంగతనం చోటుచేసుకుంది. తాము మొబైల్ కంపెనీ అధికారులమని నమ్మించి, ఏకంగా 19 లక్షల రూపాయల విలువైన మొబైల్ టవర్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. మొబైల్ టవర్ ను కూల్చివేస్తున్న క్రమంలో స్థానికులు దొంగలను ఎందుకు మొబైల్ టవర్ ను కూల్చివేస్తున్నారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే తాము సదరు మొబైల్ టవర్ కంపెనీ ఉద్యోగులమని దొంగలు చెప్పి, ఆ టవర్ నుంచి ఎంచక్కా మెటీరియల్ ను లారీలో ఎక్కించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక ఈ ఘటన పాట్నాలోని గార్డినీబాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యార్పూర్ రాజ్‌పుతానా ప్రాంతంలో జరిగింది.

టవర్ ను కూల్చడానికి కావలసిన పనిముట్లు, గ్యాస్ కట్టర్ లతో వచ్చిన దాదాపు ఇరవై ఐదు మంది దొంగల ముఠా ఈ నేరానికి పాల్పడినట్లు గార్డినీబాగ్ పోలీస్ స్టేషన్లో దాఖలు అయిన ఫిర్యాదు ద్వారా తెలుస్తుంది. సదరు మొబైల్ టవర్ కంపెనీ కి సంబంధించిన వారు, తమ మొబైల్ టవర్ చోరీ అయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కంపెనీ అధికారులు టవర్ పనిచేయకపోవడంతో పరిశీలించటానికి వచ్చినప్పుడు అక్కడ టవర్ లేకపోవడం గమనించి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. దీంతో దొంగతనం జరిగినట్లుగా గుర్తించి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏది ఏమైనా బీహార్ దొంగలు ఇటీవల కాలంలో చేస్తున్న దొంగతనాలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. వీళ్ళ చోర కళ అక్కడ అందరినీ షాక్ కు గురి చేస్తుంది. ఎంతైనా వీళ్ళు మామూలు దొంగలు కాదబ్బా అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇక శాంతి భద్రతలను పరిరక్షించవలసిన పోలీసులకు ఈ దొంగలు నిత్యం పెను సవాల్ విసురుతున్నారు.