సెగ స్టార్ట్: ఆయన్ని కేబినెట్‌లో తీసుకుంటే..: మోడీకి యంగ్ లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: దేశ రాజకీయాలన్నీ ప్రస్తుతం హస్తిన వైపు చూపులు సారించాయి. ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. వచ్చే ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న కేంద్ర మంత్రివర్గం విస్తరణకు ముహూర్తం కుదరడం..కూర్పు ఎలా ఉండబోతోందనే ఉత్కంఠత నెలకొంది. ఎన్నికలను ఎదుర్కొనే రాష్ట్రాలకు సహజంగానే ప్రాధాన్యత ఉంటుందంటూ ఎన్డీఏ పెద్దలు కూడా చెబుతోండటం ఈ విస్తరణ ఘట్టాన్ని మరింత ఆసక్తికరంగా మార్చివేసింది. ఏ సామాజిక వర్గానికి ఎలాంటి శాఖలు దక్కుతాయనేది చర్చనీయాంశమౌతోంది.

కోర్టుకెళ్తామంటూ వార్నింగులు
ఒకవంక- బీజేపీలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ సందడి నెలకొని ఉండగా.. దానిపై నీళ్లు చల్లేలా అప్పుడే రుసరుసలు కూడా ప్రారంభం అయ్యాయి. ఏకంగా ప్రధానికే హెచ్చరికలను పంపించే పరిస్థితి నెలకొంది. ఎన్డీఏలో భాగస్వామ్యపక్షంగా ఉన్న బిహార్ రాజకీయ పార్టీ లోక్‌జనశక్తి పార్టీ చీలిక వర్గం నేత పశుపతి కుమార్ పరాస్‌కు కేబినెట్ బెర్త్ లభిస్తుందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో- ఆ పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ ఘాటుగా స్పందించారు. పశుపతిని మంత్రివర్గంలోకి తీసుకోకూడదంటూ హుకూం జారీ చేశారు. అదే జరిగితే- తాముు కోర్టుకెళ్తామనీ హెచ్చరించారు.

చీలిక నేతను ప్రోత్సహిస్తారా?
ఇదివరకు లోక్‌జనశక్తి పార్టీ కోటా కింద రామ్ విలాస్ పాశ్వాన్ కేంద్రమంత్రివర్గంలో సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. ఇప్పుడా కోటాను భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రధాని మోడీపై ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని పశుపతిని కేబినెట్ బెర్త్ కన్‌ఫర్మ్ చేశారనే వార్తలు విస్తృతంగా వెలువడుతోన్నాయి. చీలికవర్గం నేతను ఎలా గుర్తిస్తారంటూ చిరాగ్ పాశ్వాన్ ప్రశ్నిస్తోన్నారు. పశుపతిని తాము పార్టీ నుంచి బర్తరఫ్ చేశామని, ఆయనను ఎల్జేపీ నాయకుడిగా గుర్తించట్లేదని తేల్చి చెప్పారు. అలాంటి నాయకుడికి మంత్రి పదవి ఇవ్వొద్దని అన్నారు. ఆయన్ని తీసుకుంటే.. తాము కోర్టుకెళ్తామని స్పష్టం చేశారు.

నో ఎల్జేపీ కోటా..
ఆయనను స్వతంత్ర ఎంపీగా కేబినెట్‌లోకి తీసుకుంటే తనకు అభ్యంతరం లేదని, ఎల్జేపీ నేతగా కాదని చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు. పశుపతి పరాస్ ప్రిన్స్ రాజ్, చందన్ సింగ్, వీణా దేవి, మహబూబ్ అలీ కేషర్ తమ పార్టీ ఎంపీలు కాదనే విషయాన్ని తాము కేంద్ర ఎన్నికల కమిషన్‌కూ సమాచారం ఇచ్చామని గుర్తు చేశారు. పశుపతి పరాస్‌కు కేంద్రమంత్రి పదవి బెర్త్ దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తోంది. ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు రావడంతో ఆయన పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కేంద్రమంత్రి పదవి కోసమే పశుపతి.. పార్టీని చీల్చారనే అభిప్రాయాలు ఉన్నాయి.
Recommended Video

బిహార్ కోటా ఎక్కువే..
బిహార్‌లో అధికారంలో ఉన్న మిత్రపక్షం జనతాదళ్ యునైటెడ్‌తో పాటు లోక్ జనశక్తి పార్టీ కోటా కింద మంత్రిపదవులను ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా- జేడీయూకు చెందిన ముగ్గురు ఎంపీలను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అదే సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ మరణంతో ఖాళీ అయిన కోటాను ఆయన తమ్ముడు పశుపతి కుమార్ పరాస్‌తో భర్తీ చేయాలని ప్రధాని భావిస్తోన్నారు. ఈ సమయంలో చిరాగ్ పాశ్వాన్ నుంచి హెచ్చరికలు రావడంతో ప్రధాని ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.












Click it and Unblock the Notifications