మేం భయపడట్లేదు, వ్యక్తిగత భజన ఆపాలి: చిదంబరం
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో అక్రమ సంపాదనను దాచుకున్న వ్యక్తుల జాబితా విడుదలపై తామేమీ భయపడటం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం అన్నారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ కొత్తగా చేసింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు.
విదేశాల్లో నల్లధనం దాచిన వారి జాబితాలో గత యూపీఏ ప్రభుత్వంలోని మంత్రి ఒకరు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై పి. చిదంబరం పై విధంగా స్పందించారు.

‘జాబితాలో పేర్లున్న వ్యక్తులు భయపడతారు తప్పించి, పార్టీ ఎందుకు కలవరపడుతుంది? ఈ తరహా అక్రమాలు వ్యక్తిగతమైనవి' అని చిదంబరం వ్యాఖ్యానించారు. ‘బ్లాక్ మనీ జాబితా వెల్లడిలో బీజేపీ కూడా మా మాదిరే వ్యవహరిస్తోంది. న్యాయపరంగా సర్కారు నిర్ణయం సరైనదే. అయితే మాపైనే తిరిగి నిందలేస్తూ తప్పు చేస్తోంది' అని చిదంబరం అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఆత్మస్ధైర్యం సన్నగిల్లుతోందని, అధినాయకత్వం వెంటనే స్పందించాలని సూచించారు. ప్రజలు, సోషల్ మీడియాకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరింతగా చేరువ కావాలని ఆయన అన్నారు.
సోనియా గాంధీ ఉన్నంత వరకూ కాంగ్రెస్ పార్టీలో ఆమే నెంబర్ వన్ అంటూ, పార్టీలో ఇప్పటికైనా వ్యక్తిగత భజనలు ఆపాలని అన్నారు. ఓటమిల నేపథ్యంలో పార్టీ పునర్ వ్వవస్ధీకరణ తక్షణమే చేపట్టాల్సిన ఆవస్యకత ఉందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అత్యవసరంగా దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్‌లో పార్టీ అధ్యక్ష పదవిని ఎవరైనా చేపట్టొచ్చని ఆయన పేర్కొన్నారు.
బయట పెట్టండి: కాంగ్రెస్
బ్లాక్ మనీ జాబితాపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ విలేకరులతో మాట్లాడుతూ తమను బెదిరించడానికి ప్రయత్నించవద్దని సూచించింది. నల్లధనం వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తీసుకోవాలని తెలిపింది. అటువంటి వారి పేర్లన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేసింది. అంతేకానీ ప్రతీకారచర్యలకు అవకాశంగా తీసుకోకూడదని హితవు పలికింది. అర్థసత్యాలతో సరిపెట్టవద్దని చెప్పారు.












Click it and Unblock the Notifications