నా నుండి కాదు..పివి నుండి: మోడీ, చిదంబరం విసుర్లు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి చిదంబరంలు తన నుండి ఆర్థిక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదని, మాజీ ప్రధానులు పివి నర్సింహా రావు, అటల్ బిహారీ వాజపేయిల నుండి నేర్చుకోవాలని గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ శనివారం ధ్వజమెత్తారు. ఢిల్లీలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ కేంద్రంపై దుమ్మెత్తిపోశారు.
దేశమంతా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నా, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ చింతే లేకుండాపోయిందని, సామాన్యుడిని ధరలు భయపెడుతున్నా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలన్న ధ్యాసే ప్రభుత్వంలో కనిపించడం లేదని దుయ్యబట్టారు. ఎన్డీయే సహా కాంగ్రెసేతర ప్రభుత్వాలు ధరలను గట్టిగా కట్టడి చేశాయని చెప్పుకొచ్చారు.

కేంద్ర ప్రభుత్వంలో ఓ కీలక మంత్రి ఉన్నారని, ఆయన తనను తాను గొప్ప మేధావిగా భావించుకుంటూ ఉంటారని పరోక్షంగా చిదంబరాన్ని ఉద్దేశించి ఘాటుగా ఎద్దేవా చేశారు. మోడీ దగ్గర ఆర్థిక పాఠాలు నేర్చుకోవాల్సిన పని లేదన్న చిదంబరం వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.
తన దగ్గర కాకపోతే పివి నర్సింహా రావు, వాజపేయిల దగ్గర అయినా నేర్చుకోమండి... పాలన ఎలా చేయాలో.. ఆ పివి, వాజపేయిలు ఆర్థిక వేత్తలు కాకపోవచ్చు కానీ, దేశ సమస్యలు వాళ్లకు బాగా తెలుసునన్నారు.
చిదంబరం విసుర్లు
మోడీ ఆర్థిక శాస్త్రంలో తన తొలి పాఠం చెప్తున్నారంటూ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం శనివారం మరోసారి ధ్వజమెత్తారు. అంతేకాదు, భారతీయులు బంగారాన్ని పెద్దఎత్తున కొనడం వల్లే ద్రవ్యోల్బణం పెరుగుతోందని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. ‘చరిత్ర పాఠాల తర్వాత మోడీ ఇప్పుడు ఆర్థిక శాస్త్రంలో తన తొలి పాఠాన్ని చెప్పారు. దాదాపు పూర్తిగా దిగుమతి చేసుకుంటున్న బంగారం కొనుగోలు వల్ల కరెంట్ ఖాతా లోటు మరింతగా పెరిగిందని చాలా సందర్భాల్లో చెప్పినట్లు నాకు గుర్తుంది. అయితే ద్రవ్యోల్బణం పెరుగుదలకు బంగారం కొనడం కారణమని చెప్పినట్లు నాకు ఎప్పుడూ గుర్తు లేదు' అని చిదంబరం శనివారం ఓ ప్రకటనలో అన్నారు.












Click it and Unblock the Notifications