మల్లికార్జున ఖర్గేకు మోడీ ఫోన్: ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. ఓ సభలో ప్రసంగిస్తూ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఖర్గేకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాంక్షించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తన ఆరోగ్యం గురించి ప్రధాని మోడీకి ఖర్గే వివరించినట్లు సమాచారం.
జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలప్రచారంలో భాగంగా కఠువా జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. అయితే, ప్రసంగిస్తున్న సమయంలోనే వేదికపై సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది, సహచరులు ఆయనను పట్టుకుని మంచి నీళ్లు తాగించారు. సేదతీరేలా చేశారు.

ఆ తర్వాత కొద్ది సేపటికే తన ప్రసంగం కొనసాగించిన ఖర్గే.. ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను ఎనభైలో ఉన్నానని, ఇప్పుడే మరణించబోనని ఖర్గే వ్యాఖ్యానించారు. అంతేగాక, ప్రధాని నరేంద్ర మోడీని అధికారం నుంచి దించే వరకూ తాను బతికే ఉంటానని వ్యాఖ్యానించారు.
తాము రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి పోరాడుతామన్నారు ఖర్గే. జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలను కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఖర్గే విమర్శించారు. ఎన్నికలు నిర్వహించాలని భావించి ఉంటే రెండేళ్లలోపే చేసి ఉండేవారని అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని రిమోట్-కంట్రోల్డ్ ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంతాన్ని నియంత్రించాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
గత దశాబ్ద కాలంగా ప్రధాని మోడీ పాలనపై కూడా కాంగ్రెస్ చీఫ్ విమర్శలు గుప్పించారు. గత 10 ఏళ్లలో భారత యువతకు ప్రధాని మోడీ ఏమీ ఇవ్వలేదన్నారు. తమకేం చేశారో ప్రజలు బీజేపీ నాయకులను ప్రశ్నించాలన్నారు. జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలు కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలకు అద్దం పడుతున్నాయి. కాగా, ఖర్గేకు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications