వేరు కారణాలతో రెండింట మోడీ, రాహుల్: బరిలో బప్పీ
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు లోకసభ స్థానాల నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మోడీ గుజరాత్‌లో ఓ నియోజకవర్గం నుండి, ఉత్తర ప్రదేశ్‌లోని వారణాశి లేదా లక్నో నుండి పోటీ చేసే అవకాశాలున్నాయి.
ఉత్తర ప్రదేశ్ ఢిల్లీ రాజకీయాలకు ముఖ్యమైన రాష్ట్రం. ఢిల్లీ గద్దెనెక్కాలంటే యుపిలో బాగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తర భారతంలో మోడీ హవా వీస్తోంది. ఈ నేపథ్యంలో యుపి నుండి మోడీ పోటీ చేయడం బిజెపికి ప్లస్ అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

మరోవైపు రాహుల్ గాంధీ మరోసారి అమేథీ నుండి పోటీ చేసి గెలవడం కష్టం కావొచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు. ఇటీవలె ఆమ్ ఆద్మీ పార్టీ నేత తాను రాహుల్ పైన పోటీ చేస్తానని సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఓ వైపు మోడీ హవా, మరోవైపు ఎఎపి హవా నేపథ్యంలో అమేథీతో పాటు కర్నాటకలోని సురక్షిత ప్రాంతం నుండి పోటీ చేయడం ఉత్తమమని పలువురు సూచిస్తున్నారట.
మరోవైపు, ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన సంగీత దర్శకుడు బప్పి లహిరి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు రాజస్థాన్ లోని అజ్మీర్ లేదా జైపూర్ ప్రాంతాల నుంచి ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయిన సచిన్ పైలెట్‌ను అజ్మీర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తోన్నట్లుగా సమాచారం.
అదే బప్పి లహిరి జైపూర్ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ నేత అయిన మహేష్ జోషీని బరిలోకి దింపాలని హస్తం అనుకుంటున్నట్లు సమాచారం. ఇలా రెండు ప్రాంతాల్లో బప్పికి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ దూకుడుగా ఉంది. ఏది ఏమైనా ఈ సారి ఎన్నికాలంలో ఈ హిందీ సంగీత దర్శకుడు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications