కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోసిన మోడీ, ఇంటర్వ్యూలు రద్దు
మీరట్: ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. ప్రతిపక్షం బాధ్యత మరిచి ప్రవర్తిస్తోందని, పార్లమెంటును పని చేయనిస్తామని నూతన సంవత్సర తీర్మాన వారు చేసుకోవాలని హితవు పలికారు. ఈ విషయమై నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నానని వ్యాఖ్యానించారు.
ఢిల్లీని మేరట్‌కు అనుసంధానించే 14 వరుసల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ రహదారిని రూ.7,566 కోట్లతో నిర్మించనున్నారు. పేదల కోసం తన ప్రభుత్వం ఒక్కో చర్య తీసుకోవడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు.
1857లో సిపాయిల తిరుగుబాటులో మీరట్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, బానిసత్వం నుంచి దేశానికి విముక్తి కోసం సాగిన పోరుకు మీరట్‌లోనే బాటలు పడ్డాయన్నారు. ఇప్పుడు కాలుష్యం నుంచి దేశాన్ని విముక్తం చేయాల్సి ఉందని చెప్పారు. ఈ విషయంలోనూ మీరట్ మనకు మార్గం చూపుతోందన్నారు.
పార్లమెంట్ కార్యకలాపాలను స్తంభింపచేస్తూ దేశాభివృద్ధికి అడ్డుతగులుతోందంటూ కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఈ సందర్భంగా విరుచుకుపడ్డారు. దేశాభివృద్ధి కోసం పార్లమెంట్‌ను పని చేయనీయనిస్తామని ఆ పార్టీ కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతిన బూనాలన్నారు.
ఆరు దశాబ్దాలకు పైగా అధికారాన్ని అనుభవించిన ఆ పార్టీకి రాజకీయ కారణాలతో పార్లమెంట్ కార్యకలాపాలను తుడిచిపెట్టేసే హక్కు లేదన్నారు. పేదల కోసం తమ ప్రభుత్వం ఒక్కో చర్య తీసుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. కొన్ని పాత చట్టాలు కాలం చెల్లాయని, పేదల సంక్షేమానికి, దేశ ఆర్థికాభివృద్ధికి అవి ఉపయోగపడవన్నారు.

చాలా అంశాలపై కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. చట్టాలు చేసే పార్లమెంట్‌ను నడవనీయకపోవడం దేశం దురదృష్టమన్నారు. ప్రజల తిరస్కరణకు గురైనవారు పార్లమెంట్ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారని, ఇలా చేయవద్దని ఈ పార్టీలన్నింటికీ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
లోకసభలో మాట్లాడే అవకాశం తనకు రానందున, తన అభిప్రాయాలను జనసభలో వెల్లడిస్తున్నానని, ప్రజలు మనల్ని పార్లమెంట్‌కు పంపించింది చర్చలు జరిపి, కలిసి సమాలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవడానికన్నారు. దేశాన్ని అరవై ఏళ్లకు పైగా పాలించిన వారిపై ఈ బాధ్యత ప్రత్యేకంగా ఉందని కాంగ్రెస్‌ను ఉద్దేశించి అన్నారు.
వారి రాజకీయ కారణాల వల్ల దేశాభివృద్ధి ఆగిపోకుండా చూడాల్సిన బాధ్యత వారిదే అన్నారు. దేశాన్ని పాలించే అవకాశం రాని వారి కోపాన్ని అర్థం చేసుకోగలనని, కానీ అరవై ఏళ్ల పాటు అన్ని రకాల అధికారాన్ని అనుభవించిన వారికి పార్లమెంట్‌ను అడ్డుకునే హక్కు లేదన్నారు.
ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎత్తివేత
క్లాస్ థర్డ్, క్లాస్ ఫోర్ ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపికలో ఇంటర్వ్యూ పద్ధతిని ఎత్తివేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దేశ యువతకు ఇది నూతన సంవత్సర ప్రత్యేక కానుకగా అభివర్ణించారు. మూడు, నాలుగు తరగతుల ఉద్యోగాలకు శుక్రవారం నుంచి ఇది వర్తిస్తుందన్నారు.
29 లక్షలకు పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రభావం చూపించే ఈ నిర్ణయం వల్ల అవినీతి నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ఉద్యోగాల కోసం ఎవరిపైనో ఆధారపడాల్సిన అనివార్యతను ఇది తప్పిస్తుందన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు.
'ఎవరి ద్వారానో పైరవీ చేయించి ఉద్యోగాలు పొందడానికి ఇంటర్వ్యూలు ఒక మార్గంగా నిలుస్తున్నాయి. నిజంగా అర్హతలున్నవారికి దీనివల్ల అవకాశాలు దక్కడం లేదు. అందుకే ఇంటర్వ్యూలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్నివిధాలా అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగావకాశం వారి ఇంటి తలుపుతట్టి మరీ వస్తుంద'ని ప్రధాని వివరించారు.












Click it and Unblock the Notifications