14 నుంచి పార్లమెంటు సమావేశాలు!: కరోనా కారణంగా ప్రత్యేక ఏర్పాట్లు
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ నెల నుంచి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సూచించినట్లు తెలిసింది. శని, ఆది వారాల్లో కూడా లోక్‌సభ , రాజ్యసభ సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఉదయం నాలుగు గంటలపాటు ఒక సభ, సాయంత్రం నాలుగు గంటలపాటు మరో సభ జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇలా సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు మొత్తం 18 రోజులపాటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో సమావేశాల నిర్వహణకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

భౌతిక దూరం నిబంధనలకు అనుగుణంగా ఉభయసభల్లో సభ్యులకు సీట్లు కేటాయించనున్నారు. ఇక ఛాంబర్లు, గ్యాలరీలు సభ్యులకే సీట్లు కేటాయించనున్నారు. రాజ్యసభలో 60 మంది సభ్యులు ఛాంబర్‌లో, మరో 51 మంది గ్యాలరీల్లో, మిగితా 132 మంది సభ్యులు లోక్‌సభలో కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. భారత పార్లమెంట్ చరిత్రలో 1952 తర్వాత ఇలా చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదే తరహాలో సీటింగ్ ఏర్పాట్లను లోక్‌సభలోనూ చేస్తున్నారు. పలు చోట్లలో భారీ తెరలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
కాగా, జులై 17న సమావేశమైన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటు సమావేశాలపై చర్చించారు. ఆగస్టు చివరికల్లా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను వెంకయ్యనాయుడు ఆదేశించారు. ఈ క్రమంలో అధికారులు సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications