• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Moonlighting: ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయొద్దని భారత టెక్ సంస్థలు ఎందుకు చెబుతున్నాయి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మూన్‌లైటింగ్‌

దిల్లీకి చెందిన సాహిల్ (పేరు మార్చాం) 2019లో రెండో ఉద్యోగం మొదలుపెట్టాలని అనుకున్నప్పుడు ఇదేమీ పెద్ద సమస్య కాదని ఆయన అనుకున్నారు.

ప్రపంచంలోని అతిపెద్ద టెక్ సంస్థల్లోని ఒక సంస్థలో గత మూడేళ్లుగా ఆయన ఉద్యోగం చేస్తూనే, ఇతర ఐటీ సంస్థల కోసం కూడా ఆయన పనిచేస్తున్నారు. ముఖ్యంగా నిమాయకాల కోసం ఆయన కోడింగ్ ఇంటర్వ్యూలు చేస్తుంటారు. ఒక్కో ప్రాజెక్టుకు ఆయనకు దాదాపు పది వేల డాలర్లు (రూ.8.17 లక్షలు) వరకు సంపాదిస్తుంటారు.

ఈ రెండో ఉద్యోగం గురించి ఆయన మాతృ సంస్థకు తెలియదు. ఎందుకంటే ఈ రెండో పనితో తను చేసే మొదటి ఉద్యోగంపై ఎలాంటి ప్రభావం పడదని ఆయన అంటున్నారు.

ప్రధాన ఉద్యోగ సంస్థకు తెలియకుండా రెండో ఉద్యోగం చేయడాన్ని మూన్‌లైటింగ్‌గా పిలుస్తారు. ఇటీవల దీనిపై మీడియాలో చర్చ ఎక్కువైంది. మూన్‌లైటింగ్‌కు పాల్పడితే సహించేదిలేదని ఇటీవల కొన్ని ఐటీ సంస్థలు హెచ్చరించాయి.

మరోవైపు తమ ప్రత్యర్థి సంస్థల కోసం పనిచేస్తున్నారని చెబుతూ ఇటీవల 300 మంది ఉద్యోగులను భారత టెక్ దిగ్గజం విప్రో విధుల నుంచి తొలగించింది. మూన్‌లైటింగ్‌పై మొదట్నుంచీ విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తమ ఉద్యోగులను హెచ్చరిస్తూనే ఉన్నారు. దీన్ని మాతృసంస్థకు మోసం చేయడమేనని ఆయన అంటున్నారు.

అయితే, ఇటీవల మూన్‌లైటింగ్‌కు ఒక కేంద్ర మంత్రి మద్దతు పలికారు. భారత్‌లో ఉద్యోగ విధానాల్లో మార్పులు వస్తున్నాయని ఆయన అన్నారు. అయితే, మాతృ సంస్థలతో కుదుర్చుకునే ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించడకూడదని ఆయనతోపాటు నిపుణులు కూడా సూచిస్తున్నారు.

మూన్‌లైటింగ్‌

''ఇది చాలా క్లిష్టమైనది’’

మూన్‌లైటింగ్‌ను చాలా క్లిష్టమైన విధానంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. నేడు ఉద్యోగ మార్కెట్‌ను అస్థిరపరిచే పరిణామాలు ఎక్కువ కావడంతో చాలా మంది ఆర్థిక స్థిరత్వం కోసం రెండో ఉద్యోగం చేస్తున్నారు. మరికొందరు మాత్రం వృత్తిపరమైన సంతృప్తి కోసం రెండో ఉద్యోగం వెతుక్కుంటున్నారు.

అయితే, రెండో ఉద్యోగం చేయబోమని మాతృ సంస్థతో ఒప్పందం కుదర్చుకుంటే, ఆ ఉద్యోగులకు చట్టపరమైన చిక్కులు ఎదురయ్యే ముప్పు కూడా ఉంటుంది.

''ఖాళీ సమయాల్లో నచ్చిన పని చేసుకోవడం లేదా లక్ష్యం లేదా అదనపు డబ్బుల కోసం పనిచేయడం వేరే. రెండు పూర్తికాల ఉద్యోగాలు చేయడం వేరు. ఈ రెండింటినీ ఒకేలా చూడకూడదు’’అని పారిశ్రామికవేత్త రజత్ గార్గ్ అన్నారు.

ఖాళీ సమయాల్లో ఉద్యోగులు చేసుకునే పనుల్లో ఉద్యోగ సంస్థలు జోక్యం చేసుకోకూడదని ఆయన అంటున్నారు.

''అయితే, బాగా అలసిపోయి ఉద్యోగానికి హాజరుకావడం లేదా మాతృసంస్థ కోసం సరిగా పనిచేయకపోవడం లాంటి వాటిని అసలు సహించకూడదు. అవే అసలైన సమస్యలు’’అని ఆయన అన్నారు.

మూన్‌లైటింగ్‌

ఇదేమీ కొత్త కాదు

భారత్‌లో మూన్‌లైటింగ్ ఏమీ కొత్తకాదు. అయితే, ఇటీవల కాలంలో ఇది బాగా ఎక్కువైందని టెక్ నిపుణుడు ప్రశాంతో రాయ్ అన్నారు. ''కోవిడ్-19 మహమ్మారిని దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. వైరస్ వ్యాప్తి సమయంలో ఒకే సమయంలో భిన్న పనులు చేయడం ఉద్యోగులు నేర్చుకున్నారు’’అని ఆయన అన్నారు.

మరోవైపు భారత్‌లో మూన్‌లైటర్లకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు కొన్ని రెడిట్ గ్రూపులు, డిస్కార్డ్ చానెళ్లు కూడా ఏర్పాటు అవుతున్నాయి.

సాధారణంగా ఐటీ, డ్రైవింగ్, ఆన్‌లైన్ రీటెయిలింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, కంటెంట్ రైటింగ్ లాంటి విభాగాల్లో ఎక్కువగా రెండో ఉద్యోగాన్ని మూన్‌లైటర్లు వెతుక్కుంటున్నారు.

ఐటీ రంగంలో మూన్‌లైటింగ్ అనేది సర్వ సాధారణంగా మారిపోతోందని గార్గ్ వివరించారు. ''పూర్తికాల ఉద్యోగాలుచేసేవారు నేడు చాలా అంకుర సంస్థలను ఏర్పాటుచేస్తున్నారు. ఉదాహరణకు స్టీవ్ వోజ్నైక్‌ను తీసుకోండి. ఆయన హెచ్‌పీ సంస్థ కోసం పనిచేస్తూ తొలి యాపిల్ కంప్యూటర్‌ను డిజైన్ చేశారు’’అని ఆయన చెప్పారు. తమ ఉద్యోగుల్లో చాలా మంది కూడా మూన్‌లైటింగ్ చేస్తుంటారని ఆయన వివరించారు.

''అయితే, మా ఉద్యోగులు సంస్థ సమాచారాన్ని దొంగిలించి తమ లాభాపేక్ష కోసం వాడుకుంటే అసలు సహించబోం. అది పూర్తిగా అక్రమం అవుతుంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.

''ఇక్కడ విప్రో కూడా మూన్‌లైటింగ్ చేసే అందరినీ ఉద్యోగాల్లో నుంచి తీసేయలేదు. తమ ప్రత్యర్థి సంస్థల్లో పనిచేసే వారిపైనే చర్యలు తీసుకుంది. అలా చేసేందుకు వారికి అన్ని హక్కులూ ఉన్నాయి’’అని ఆయన చెప్పారు.

మూన్‌లైటింగ్‌

ముందే ఒప్పందాల్లో ఉండాలి..

ఉద్యోగాల్లో చేరేటప్పుడే చాలా ఐటీ సంస్థలు వేరే సంస్థల కోసం పనిచేయబోమని ఒప్పందాలు కుదుర్చుకుంటాయని రాయ్ వివరించారు.

''కొంతమంది ఉద్యోగులు ఖాళీ సమయాల్లో పనిచేసేందుకు మరో ఉద్యోగాన్ని సంపాదించొచ్చు. మాతృసంస్థకు ప్రత్యర్థులుగా లేని సంస్థలను ఎంచుకోవచ్చు. కానీ, ఈ విషయంలో పూర్తి అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది. ముఖ్యంగా మీరు విదేశీ క్లయింట్ల కోసం పనిచేస్తున్నప్పుడు ఎవరు ప్రత్యర్థులు, ఏ సంస్థల్లో తాము పనిచేయొచ్చు? లాంటివి గుర్తించడం కష్టం’’అని ఆయన అంటారు.

అయితే, మూన్‌లైటింగ్‌ను వ్యతిరేకించేవారు మాత్రం ఇలా చేయడం నైతికంగా తప్పని అంటున్నారు.

2020 వరకు దిల్లీకి చెందిన ఒక అంకుర సంస్థల్లో డేటా అనలిస్ట్‌గా అర్జున్ (పేరు మార్చాం) పనిచేసేవారు. ఆయన ఎక్కువ గంటలు పనిచేయాల్సి వచ్చేది. అయితే, జీతం బానే వచ్చేది. కుటుంబంతో సమయాన్ని ఆస్వాదించేందుకు ఆయన అంత ఎక్కువ సమయం మాత్రం ఉండేది కాదు.

అయితే, కోవిడ్-19 వ్యాప్తి నడుమ ఆయన పని ఒత్తిడి తగ్గింది. ''నాకు అప్పుడు చాలా ఖాళీ సమయం దొరికింది. దాన్ని మెరుగ్గా ఉపయోగించాలని అనుకున్నాను’’అని 28ఏళ్ల ఆయన చెప్పారు. నేడు క్రిప్టో బ్లాక్‌చెయిన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులకు ఆయన ఫ్రీల్యాన్సింగ్ చేస్తున్నారు.

''నేను జీతం కోసమే పనిచేయడం లేదు. నాకు నచ్చిన కెరియర్‌కు మారడానికి ఈ రెండో ఉద్యోగం సాయం చేస్తోంది’’అని అర్జున్ చెప్పారు.

''ఇక్కడ చాలా మంది ఉద్యోగాలు మారుతుంటారు. ఎందుకంటే ఇక్కడ కొత్త నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. కొత్త రంగాల్లోకి అడుగుపెట్టొచ్చు. మనకు నచ్చిన పని చేసుకోవచ్చు’’అని ఆయన అన్నారు.

ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్‌వేర్ సర్వీసుల్లో మూన్‌లైటింగ్‌పై చర్చ ఎక్కువగా జరుగుతోందని, అయితే, చాలా రంగాల్లో ఇలాంటి రెండో ఉద్యోగాలు చేసే వారుంటారని రాయ్ అన్నారు.

మీరు ఎంచేస్తుంటారు? అని సామ్రాట్ ఖన్నాను అడిగితే, ''అన్ని పనులు చేస్తుంటా’’అని ఆయన చెబుతుంటారు.

29ఏళ్ల సామ్రాట్ పైలట్‌గా వారంలో ఆరు రోజులు భారత్‌లోని అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థల్లోని ఒక దాంట్లో పనిచేస్తారు. తీరిక సమయాల్లో డీజేగా కూడా పనిచేస్తారు. ఆయనకు బార్ కూడా ఉంది.

''నేను చేసే పనుల వివరాల్లో కొన్నింటిని ఉద్యోగంలో చేసేటప్పుడే వెల్లడించాను. వారు కూడా పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు’’అని ఆయన చెప్పారు.

''ఖాళీ సమయాల్లో నేను ఏం చేస్తానో ఎవరికైనా ఎందుకు అసవరం ఉంటుంది?’’అని ఆయన ప్రశ్నించారు.

అయితే, ఇక్కడ మాతృ సంస్థలో చేరేటప్పుడు ఒప్పందంలో ఏం నిబంధనలపై సంతకం చేశామనే దానిపైనే అన్నీ ఆధారపడి ఉంటాయని గార్గ్ అన్నారు.

''వేరే ఉద్యోగం చేసేందుకు మీకు వీలులేదని చెబితే, మీరు చేయకూడదు. ఉద్యోగులు తమ హక్కులతోపాటు తాము నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి కూడా తెలుసుకోవాలి’’అని ఆయన అంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Moonlighting: Why Indian tech firms say don't do two jobs at once
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X