వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోర్బీ బ్రిడ్జి: 'బాధ్యులను ఉరి తీయలి'. - ముగ్గురు కొడుకులను కోల్పోయిన తల్లి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మోర్బీ బ్రిడ్జి

ఆదివారం సాయంత్రం 20 ఏళ్ల చిరాగ్ ముచాడియా, అతడి తమ్ముళ్లు 17 ఏళ్ల ధార్మిక్, 15 ఏళ్ల చేతన్ బయటికి షికారుకు వెళ్లారు. ముగ్గురూ "ఝూల్తో పుల్" (వేలాడే వంతెన) చూడ్డానికి వెళుతున్నామని వాళ్లమ్మ కాంతాబెన్‌తో చెప్పారు.

ఈ వేలాడే వంతెనను బ్రిటిష్ కాలంలో నిర్మించారు. కొన్ని నెలల మరమ్మత్తుల తరువాత ఇటీవలే దాన్ని సందర్శకులకు తెరిచారు.

దీపావళి పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. చాలామంది తమ కుటుంబాలతో చిరాగ్, అతడి తమ్ముళ్లలాగే సరదాగా తీగల వంతెన చూడ్డానికి వెళ్లారు.

తీగల వంతెన సందర్శించడానికి టికెట్ పెద్దవాళ్లకు రూ. 17, పిల్లలకు రూ. 12. చిరాగ్ అతడి తమ్ముళ్లు టికెట్లు తీసుకుని 230 మీటర్ల వంతెన పైకి వెళ్లారు.

నితిన్ కవైయా కూడా తన భార్య, పిల్లలతో వంతెన చూడ్డానికి వెళ్లారు. నితిన్‌కు ఇద్దరు ఆడపిల్లలు.. ఏడేళ్ల పాప, ఏడు నెలల పసిపాప.

అందరూ వంతెన పైకి వెళ్లారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. సాయంత్ర, 6.30 సమయంలో వంతెన మీద నుంచి కిందకి దిగారు. పక్కనే మచ్చు నది ఒడ్డున కూర్చున్నారు.

"బ్రిడ్జి మీద చాలామంది జనం ఉన్నారు. సుమారు 400-500 మంది ఉండుంటారు. టికెట్లు అమ్ముతున్న వాళ్ల దగ్గరకు వెళ్లి, రద్దీ తగ్గించాలని చెప్పాను. వాళ్లు నా మాట వినిపించుకున్నారో లేదో తెలీదు" అని నితిన్ చెప్పారు.

పది నిమిషాల తరువాత, నితిన్ చిన్న పాపకు నీళ్లు పట్టిద్దామని కిందకు వంగారు. ఇంతలోనే పెద్దగా అరుపులు, కేకలు వినిపించాయి.

అవతలి ఒడ్డుకు దగ్గరగా వంతెన విరిగిపోయింది.

"జనం నదిలో పడిపోవడం చూశాను. వాళ్లు పైకి రాలేదు. కొందరు బ్రిడ్జికి వేలాడుతున్నారు. మేమంతా వాళ్లకు సహాయం చేయడానికి ప్రయత్నించాం" అని నితిన్ చెప్పారు.

నితిన్ కుటుంబం

ఈ ప్రమాదంలో కనీసం 135 మంది చనిపోయారు. చిరాగ్, ధార్మిక్, చేతన్ కూడా చనిపోయారు.

వీళ్ల స్నేహితుడు వంతెన కూలిపోయిందన్న వార్తను వాళ్లమ్మ కాంతాబెన్‌కు అందించాడు.

"మా అబ్బాయిలకు ఫోన్ చేశాను. కానీ, లైన్ కలవలేదు. నాకు కంగారు పుట్టింది. ఇంట్లోనే అటూ ఇటూ నడవడం మొదలుపెట్టాను" అని కాంతాబెన్ చెప్పారు.

వార్త తెలిసిన వెంటనే ఆమె భర్త రాజేశ్ ప్రమాదం జరిగిన చోటుకు పరుగుతీశారు. అక్కడ ఏ సమాచారం తెలియకపోయేసరికి, ఆస్పత్రులలో వెతికారు.

రాత్రి 11.00 గంటల ప్రాంతంలో చిరాగ్, ధర్మిక్ మృతదేహాలు మోర్బీ సివిల్ ఆస్పత్రిలో కనిపించాయి.

ఆరోజు రాత్రంతా పోలీసులు, స్థానికులు, సహాయక సిబ్బంది నదిలో పడినవారి కోసం గాలిస్తూనే ఉన్నారు. మృతదేహాలను వెలికితీస్తూనే ఉన్నారు.

తెల్లావారు జామున 3.00 గంటలకు చేతన్ మృతదేహం కూడా దొరికింది.

ముచాడియా కుటుంబంలో విషాదం అలుముకుంది. రోదనలు ఆగలేదు. బంధువులు, గ్రామస్థులు వచ్చి ఓదారుస్తున్నారు.

"మా పిల్లలు ముగ్గురినీ పోగుట్టుకున్నాం. ఇంక మాకేం మిగల్లేదు. నేను, నా భర్త ఒంటరివాళ్లమైపోయాం" అంటూ కాంతాబెన్ విలపించారు.

ముగ్గురిలో పెద్దవాడు చిరాగ్ (20) కళ్లజోడు తయారీ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. తండ్రి రాజేశ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. చిరాగ్, వాళ్ల నాన్న కలిసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.

"చిరాగ్ చాలా మంచివాడు. నా మాట వినేవాడు. అందుకే, వాడేం అడిగినా నేను కాదనేవాడిని కాదు" అని రాజేశ్ చెప్పారు.

ఈ డిసెంబర్ 14కు ధార్మిక్‌కు 18 ఏళ్లు నిండుతాయి. ఆ తరువాత ఉద్యోగం వెతుక్కోవాలనుకున్నాడు.

"వాడు చాలా అల్లరి చేసేవాడు. మేమంతా కలిసి సరదగా గడిపేవాళ్లం. ఇప్పుడు ముగ్గురూ వెళ్లిపోయారు" అని చెప్తూ తండ్రి రాజేశ్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

"ధార్మిక్‌కు నూనెలో వేయించిన పరోటా అంటే చాలా ఇష్టం. అది చేయమని ఎప్పుడూ అడుగుతుండేవాడు" అని తల్లి కాంతాబెన్ చెప్పారు.

ముగ్గురిలో చిన్నవాడు చేతన్ 10వ తరగతి చదువుతున్నాడు. చేతన్ తెలివైనవాడని, చదువుల్లో ఎప్పుడూ ముందుండేవాడని తండ్రి రాజేశ్ చెప్పారు.

వాళ్లు పిల్లల పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు చూపించారు. అవి కొన్నేళ్ల క్రితం తీసినవి.

"నా కొడుకుల చావుకు కారణమైనవాళ్లని శిక్షించాలి. వాళ్లు జైల్లో మగ్గిపోవాలి. వాళ్లకి ఉరిశిక్ష వేయాలి" అన్నారు కాంతాబెన్.

"మాకు జవాబు కావాలి. మాకు న్యాయం కావాలి" అన్నారు రాజేశ్.

కాంతాబెన్

మోర్బీ బ్రిడ్జి ప్రమాదంలో చాలా కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయాయి.

దీనికి సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో టికెట్లు అమ్మినవారు, సెక్యూరిటీ గార్డులు, బ్రిడ్జికి మరమత్తులు చేసిన కంపెనీ ఒరేవాలోని మేనేజర్లు ఉన్నారు.

ఈ తొమ్మిది మందిని నిన్న కోర్టులో హాజరుపరిచారు. వీరిలో నలుగురిని పోలీసు కస్టడీకి, ఐదుగురిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

వంతెన కూలిపోవడంపై ఒరేవా సంస్థ ఇంతవరకు స్పందించలేదు.

వంతెనను సందర్శకులకు తెరిచే ముందు భద్రతా తనిఖీలు చేశారా, లేదా అని ప్రజలు ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తున్నారు.

"కళ్లు మూసుకుంటే వంతెన కూలిపోయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. నదిలో పడిపోయినవారి కేకలు చెవుల్లో ఇంకా వినిపిస్తున్నాయి. కోపంతో నేను నా టికెట్ చింపేశాను. నేనే కాదు, ఊరు మొత్తం కోపంతో రగిలిపోతోంది" అన్నారు నితిన్.

ఈ ఘటనపై సరైన విచారణ జరపాలని రాజేశ్ డిమాండ్ చేశారు.

"లేదంటే, మా పిల్లల్లాగే అనేకమంది ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు" అన్నారాయన.

అదనపు రిపోర్టింగ్: ఆకృతి థాపర్, సంజయ్ గంగూలీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Morby Bridge: 'Those responsible must be hanged'. - A mother who lost three sons
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X