38 రోజుల పసికందును అతి క్రూరంగా బలి తీసుకున్న కన్నతల్లి..
ఊయలలో నిద్రిస్తున్న 38 రోజుల పసికందు.. తల్లి ఒడే ప్రపంచం అంటూ పెరుగుతున్న ఆ చిన్నారికి.. ఆ రాత్రి మామూలుగానే మొదలైంది. ఇంట్లో అందరూ నిద్రలో ఉన్నారు. ఊయలలో నిద్రపోతున్న ఆ చిన్నారిని తీసుకెళ్లి.. నీటిలో ముంచి ఊపిరాడకుండా చేసి.. మరణించేలా చేశారు. పసి కందును చేజేతులా చంపడానికి వారికి మనసేలా వచ్చింది ? అంతటి క్రూరంగా ఎలా ప్రవర్తించారు అని సగటు మనిషికి ఆలోచన రాకుండా మానదు.
కానీ ఆ చిన్నారి ప్రాణాన్ని చిదిమేసింది కన్నతల్లి అయితే.. మాటల్లో చెప్పలేని ఈ దారుణానికి ఒడిగట్టింది ఓ దుర్మార్గపు తల్లి. నవమాసాలు మోసి కన్న ఆ తల్లి ఇంతటి కిరాతకానికి ఎలా పాల్పడింది. ఎందుకుని ఇంతటి దుశ్చర్యకి పూనుకుంది అని సర్వత్రా చర్చ జరుగుతుంది. ఈ ఘటన బెంగళూరు శివార్లలోని నెలమంగలలో చోటుచేసుకోగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాధ, ఒక 25 ఏళ్ల తల్లి. తన తల్లి రేణుకమ్మ, మానసిక వైకల్యంతో ఉన్న అన్నయ్యతో కలిసి ఒకే ఇంట్లో ఉంటుంది. గత ఆదివారం అర్ధరాత్రి సుమారు 11:30 గంటల ప్రాంతంలో, పసికందు హేమంత్ నిద్రలో ఉన్నప్పుడు, రాధామణి ఊయల నుంచి ఆ పసిపాపను తీసుకెళ్లింది. ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా.. ఆమె బాత్‌రూమ్‌లోకి వెళ్లింది. అక్కడ ఉన్న నీళ్ల బకెట్ లో ఆ చిన్నారి ముఖాన్ని ముంచి, నిమిషాల పాటు అలాగే ఉంచింది. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా వచ్చి హాల్‌లో నిద్రపోయింది.
కాగా తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రేణుకమ్మ (నానమ్మ) నిద్రలేచి చూసేసరికి ఊయలలో మనవడు కనిపించకపోవడంతో కంగారుగా.. రాధామణిని, తన కుమారుడిని లేపి, పసికందు కోసం వెతకడం ప్రారంభించింది. వారి అరుపులతో పొరుగువారు సైతం సహాయం చేయడానికి వచ్చారు. కొంతసేపటికి ఒక పొరుగింటి వ్యక్తి అనుమానంతో బాత్ రూంలో చూడగా.. పసికందు హేమంత్ శరీరం నీళ్లలో తేలుతూ కనిపించింది. హేమంత్ అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించుకున్నారు.

కట్టుకథ..
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన విషాదంపై పోలీసులు రాధామణిని ప్రశ్నించగా.. ఆమె మొదట ఒక కట్టుకథ అల్లింది. "రాత్రి 1 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి వచ్చి తనను హత్యచేయాలని ప్రయత్నించారని చెప్పుకొచ్చింది. తాను అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత, శిశువుని తీసుకెళ్లి నీళ్లలో పడేశారని చెప్పింది. అయితే ఆమె అన్నయ్య ఈ కథను ఖండించాడు. తానే డోర్‌ను లోపల నుంచి లాక్ చేశానని ఉదయం తల్లి లేపినప్పుడు కూడా డోర్ అలాగే ఉందని వెల్లడించాడు. దాంతో బయటవాళ్లు లోపలికి రాలేరని అని పోలీసులకు స్పష్టం చేశాడు. దీంతో పోలీసులు రాధామణిపై అనుమానం పెంచుకుని మరింతగా ప్రశ్నించారు. ఒత్తిడి తట్టుకోలేక, చివరికి తానే హత్య చేసినట్టు ఆమె అంగీకరించింది.
పోలీసుల విచారణలో రాధామణి ఆరోగ్య సమస్యలు, కుటుంబ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. ఆమెకు థైరాయిడ్, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిసింది. అంతేకాకుండా, ఆమె భర్త పవన్ మద్యం బానిసగా మారి.. కుటుంబాన్ని చూసుకునే బాధ్యత లేకుండా పోయిందని గుర్తించారు. ఈ తీవ్రమైన పరిస్థితులు, ప్రసవానంతర ఒత్తిడి (పోస్ట్‌పార్ట్‌మ్ డిప్రెషన్) కలిపి రాధామణిని ఈ దారుణానికి పాల్పడిందని నిర్ధారించారు.
ఈ హత్య ఘటనపై రాధామణి భర్త పవన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం రాధామణిని న్యాయ హిరాసత్‌లోకి తరలించారు. మానసిక ఆరోగ్యం, కుటుంబ సమస్యలు సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications