12 నెలల్లోఅయిదోసారి- అమాంతం పెరిగిన పాల ధర..!!
న్యూఢిల్లీ: నిత్యావసర సరుకులు, ఆహార వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడం పట్ల జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇదివరకే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నిరసిస్తూ కొన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలను సైతం నిర్వహించారు. పాలు, మజ్జిగ, పన్నీర్, బియ్యం, గోధుమలు వంటి పలు రకాల నిత్యావసరాలపై జీఎస్టీని అమలు చేయడం వల్ల దుష్పరిణామాలు సంభవిస్తాయంటూ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం ఖాతరు చేయలేదు. తాను అనుకున్నది చేసింది.

జీఎస్టీ దెబ్బకు..
జీఎస్టీ పెంపు వల్ల గానీ, ఆయా ఆహార వస్తువులను కొత్తగా జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడం వల్ల గానీ పేదలపై ఎలాంటి భారం పడదనీ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ స్వయంగా హామీ ఇచ్చినప్పటికీ- వాస్తవ పరిస్థితి మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. జీఎస్టీ దెబ్బకు పాల ధరలు పెరుగుదల బాట పట్టాయి.

మదర్ డెయిరీ ప్రకటన..
మదర్ డెయిరీ తన పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. లీటర్ ఒక్కింటికి రెండు రూపాయల మేర పెంచుతున్నట్లు తెలిపింది. పాల సేకరణ, ప్యాకింగ్ వ్యయం భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. పెరిగిన రేట్లు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. మదర్ డెయిరీ యాజమాన్యం తన పాల రేట్లను పెంచండం ఈ సంవత్సరంలో ఇది అయిదోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కిందటి నెలే పెంపు..
చివరిసారిగా కిందటి నెల 21వ తేదీన పాల రేట్లను పెంచింది మదర్ డెయిరీ.. ఇప్పుడు మళ్లీ అదే బాట పట్టింది. వినియోగదారులపై భారం మోపింది. అన్ని రకాల వేరియంట్లకూ పెరిగిన ధరలను వర్తింపజేసింది మదర్ డెయిరీ యాజమాన్యం. ఫుల్ క్రీమ్ లీటర్ పాలు 66 రూపాయలుగా నిర్ధారించింది. ప్రస్తుతం ఇది 64 రూపాయలకు లభిస్తోంది. టోన్డ్ మిల్క్ ధర లీటరు ఒక్కింటికి రెండు రూపాయల మేర పెరిగింది.

మిగిలినవీ అదే బాట..
ప్రస్తుతం 51 రూపాయలకు లభిస్తోన్న టోన్డ్ మిల్క్.. మంగళవారం నుంచి 53 రూపాయలకు చేరనుంది. డబుల్ టోన్డ్ మిల్క్ లీటర్ ఒక్కింటికి 45 నుంచి 47 రూపాయలకు పెరిగింది. ఈ పెరుగుదల ఒక్క మదర్ డెయిరీతోనే ఆగే పరిస్థితి ఉండదు. మిగిలిన సంస్థలు కూడా రేట్లను సవరించడం ఖాయంగా కనిపిస్తోంది. పాలు, మజ్జిగ, పన్నీర్.. వంటి వస్తువులను జీఎస్టీ పరిధిలోకి వాటిని తీసుకొచ్చిన అతి కొద్ది రోజుల్లోనే పాల రేట్లు విపరీతంగా పెరగడం మొదలు పెట్టాయి.












Click it and Unblock the Notifications