42 మంది పెళ్లికొడుకులు ముస్తాబై వచ్చారు.. కానీ కట్ చేస్తే లబోదిబో!
42 మంది పెళ్లి కొడుకులు ఒకేసారి ముస్తాబె వచ్చారు.. వారికి సంబంధించిన బంధుమిత్రులందరూ పెళ్లి పందిరి వద్ద ఎదురుచూస్తున్నారు. ముహూర్తం సమయం దగ్గరపడుతోంది.. కానీ ఎంతసేపటికీ పెళ్లికూతుళ్లు మాత్రం రాలేదు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో సామూహిక వివాహాల పేరుతో అమాయక కుటుంబాల భావోద్వేగాలను పెట్టుబడిగా మార్చుకుని 42 కుటుంబాలను నిలువునా ముంచిన ఈ ఘోరమైన మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లిళ్లు అవుతాయనుకుని ఆశగా వచ్చిన కుటుంబాలకు చివరకు కన్నీళ్లే మిగిలాయి.
ఈ ఘరానా మోసానికి పాల్పడిన నిందితులు.. చాలా కాలంగా తమ కొడుకులకు పెళ్లిళ్లు కాక సంబంధాల కోసం ఇబ్బంది పడుతున్న కుటుంబాలనే లక్ష్యంగా చేసుకున్నారు. వారి మానసిక బలహీనతను ఆసరాగా చేసుకుని, సోషల్ మీడియా నుంచి డౌన్‌లోడ్ చేసిన కొందరు మోడల్స్, అందమైన అమ్మాయిల ఫోటోలను వారికి చూపించారు. ఇండోర్‌లోని ఓ అనాథ శరణాలయంలో ఉండే అమ్మాయిలతో ఈ పెళ్లిళ్లు జరిపిస్తామని.. దేవాస్‌లో మే 25న ఘనంగా సామూహిక వివాహాలు ఉంటాయని నమ్మబలికారు. ఇందుకు గాను ఒక్కో కుటుంబం నుండి రూ. 12,000 నుంచి రూ.25,000 వరకు వసూలు చేశారు. ఇలా మొత్తం 42 కుటుంబాల నుంచి దాదాపు రూ. 10 లక్షలకు పైగా నొక్కేశారు.

అయితే ముందుగా కుదుర్చుకున్న ప్రణాళిక ప్రకారం మే 24వ తేదీ ఉదయమే పెళ్లికొడుకులు, వారి బంధువులు దేవాస్‌లోని రాధాగంజ్ క్లబ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. జీవితంలో అత్యంత కీలకమైన రోజు కోసం ఎంతో ముస్తాబై వచ్చిన వారికి అక్కడ ఎలాంటి పెళ్లి పందిరి గానీ, కనీస ఏర్పాట్లు గానీ కనిపించలేదు. అక్కడ ఉన్న నిర్వాహకులు ముఖేష్ బైరాగి, అతని భార్య సునీతలను నిలదీయగా.. ఇండోర్ నుంచి పెళ్లికూతుళ్లు వస్తున్నారని, దారిలో ఉన్నారని కట్టుకథలు చెప్పారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు రకరకాల అబద్ధాలు చెప్తూ కాలయాపన చేశారు. చివరకు పెళ్లికూతుళ్లు రారనే నిజాన్ని, తాము మోసపోయామనే విషయాన్ని గ్రహించిన బాధితులు లబోదిబోమన్నారు.
పోలీసుల దర్యాప్తులో ఈ దారుణమైన స్కామ్ వెనుక ఉన్న అసలు నిజాలు బయటపడ్డాయి. నిందితుడు ముఖేష్ బైరాగిని పోలీసులు ప్రశ్నించగా.. ఇండోర్‌లో ఉండే తన అన్న దినేష్ దాస్ బైరాగి అనాథ అమ్మాయిల పెళ్లిళ్ల ఏర్పాట్లు చేయమన్నాడని.. అతడే పెళ్లికొడుకుల నెంబర్లు ఇచ్చాడని తెలిపాడు. పెళ్లికొడుకులంతా అక్కడికి వచ్చాక దినేష్‌కు ఫోన్ చేయగా.. వస్తున్నానని చెప్పి ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడని ముఖేష్ పేర్కొన్నాడు. ఈ మోసంలో ముఖేష్ మామ నరసింగ్ దాస్ బైరాగి మధ్యవర్తిగా వ్యవహరించి బాధితులను ట్రాప్ చేసినట్లు తెలిసింది.
బాధితుల ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు ముఖేష్ బైరాగి, సునీతా బైరాగి, దినేష్ బైరాగి, నరసింగ్ దాస్ బైరాగిలపై మోసం కేసులు నమోదు చేశారు. ప్రధాన నిందితులైన ముఖేష్, అతని భార్య సునీతలను ఇప్పటికే అరెస్ట్ చేయగా.. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. కోడళ్లతో ఇంటికి తిరిగి వెళ్తామనుకున్న 42 కుటుంబాలకు ఆ రోజు పెళ్లి పాటలతో కాకుండా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. సమాజం ముందు జరిగిన ఈ అవమానం, మోసం ఆయా కుటుంబాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.












Click it and Unblock the Notifications