అమరావతి ఎంపీకి షాక్ -14 రోజులు జైలులోనే : న్యాయస్థానం ఆదేశం..!!
హనుమాన్ చాలీసా వివాదంలో మహారాష్ట్ర అమరావతి ఎంపికి కోర్టు జుడిషియల్ కస్టడీ విధించింది. ఎంపీతో పాటుగా భర్త ఎమ్మెల్యే రవికి సైతం రిమాండ్ విధించింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం వద్ద హనుమాన్ చాలీసా చదువుతాననే కౌర్ ప్రకటనతో శనివారం దుమారం రేగిన నేపథ్యంలో వారిని పోలీసులు అదే రోజు అరెస్టు చేశారు. బాంద్రాలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. మహారాష్ట్ర సీఎం నివాసం వద్ద తాను తన భర్తతో లిసి హనుమాచాన్ చాలీసా చదవుతానని నవనీత్ గురువారం ప్రకటించారు.

హనుమాన్ చాలీసా వివాదం
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని మరిచిపోయారని, అది గుర్తు చేసేందుకు ఆయన ఇంటిముందు తన భర్త, ఎమ్మెల్యే రవి రాణాతో కలిసి శనివారం ఉదయం 9 గంటలకు చాలీసా పారాయణ చేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో..సీఎం థాక్రే నివాసరమైన మాతోశ్రీ వద్దకు శివసేన సైనికులు శనివారం ఉదయం భారీగా చేరుకున్నారు. 9 గంటలు దాటినా నవనీత్ కౌర్ రాలేదని.. ఆమె ఇంటి వద్దకే వెళ్లారు. హనుమాన్ చాలీసా చదివేందుకు రావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను దాటారు. కొందరు కార్యకర్తలు నవనీత్ ఇంటిపై రాళ్లు రువ్వారు. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కౌర్ నివాసం వద్ద ఉద్రిక్తత
తమపైకి సీఎం ఠాక్రేనే శివసేన కార్యకర్తలను పంపించారని నవనీత్ కౌర్ ఆరోపించారు. మరోవైపు ఠాక్రేకు మద్దతుగా ఆయన నివాసం వద్దకు మహిళలు కూడా తరలివచ్చారు. తాము హనుమాన్ చాలీసా ప్రతులను కూడా తీసుకొచ్చామని, నవనీత్ కౌర్ రాణా వచ్చి దాన్ని పఠించాలని వారు అన్నారు. కాగా, పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. నవనీత్ కౌర్ దంపతులను ఇంటి నుంచి బయటకు రాకూడదని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబయికి రానున్న నేపథ్యంలో తమ ఆందోళనను వాయిదా వేస్తున్నట్లు రాణా దంపతులు ప్రకటించారు.

14 రోజుల జ్యుడిషియల్ కస్డడీ
ప్రధాని భద్రతకు విఘాతం కలిగించకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎంతకీ ఆందోళనలు తగ్గకపోవడం వల్ల.. పోలీసులు నవనీత్‌ను ఆమె నివాసం నుంచి బయటకు తరలించారు. మతపరమైన కారణాలతో రెండు వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారన్న ఆరోపణలతో ఆమెపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణాను అరెస్టు చేశారు. ఆదివారం కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం రెండు వారాలు జుడీషియల్ కస్టడీ విధించింది.












Click it and Unblock the Notifications