• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మ్యూకోర్‌మైకోసిస్: కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'

By BBC News తెలుగు
|

బ్లాక్ ఫంగస్

మూడు వారాల క్రితం కోవిడ్-19 నుంచి కోలుకున్న ఒక 25 ఏళ్ల యువతికి ఆపరేషన్ చేయడానికి ముంబయిలోని కంటి వైద్య నిపుణులు డాక్టర్ అక్షయ్ నాయర్ శనివారం ఉదయం వేచిచూస్తున్నారు.

డయాబెటిక్ అయిన ఆమెకు అప్పటికే ఆపరేషన్ థియేటర్లో ఉన్న ఈఎన్‌టీ నిపుణుడు ట్రీట్‌మెంట్ చేస్తున్నారు.

ఆమె ముక్కులో ఒక ట్యూబ్ వేసిన ఆయన 'మ్యూకోర్‌మైకోసిస్‌' వల్ల ఇన్‌ఫెక్ట్ అయిన కణజాలాన్ని తొలగిస్తున్నారు.

ఇది ఒక అరుదైన, ప్రమాదకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. తీవ్రమైన ఆ ఇన్ఫెక్షన్ ముక్కు, కళ్లు కొన్నిసార్లు మెదడుపై కూడా ప్రభావం చూపిస్తుంది.

తన కొలీగ్ అది పూర్తి చేయగానే, డాక్టర్ నాయర్ రోగి కంటిని తొలగించడానికి మూడు గంటలపాటు ఆపరేషన్ చేయాలి.

"ఆమె ప్రాణాలు కాపాడ్డానికి నేను ఆమె కన్ను తీసేస్తున్నాను. ఈ వ్యాధి అంత తీవ్రమైనది" అని డాక్టర్ నాయర్ నాతో అన్నారు.

భారత్‌లో కోవిడ్-19 సెకండ్ వేవ్ ప్రాణాంతకంగా వ్యాపిస్తుంటే, ఈ అరుదైన ఇన్ఫెక్షన్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయని డాక్టర్లు ఇప్పుడు చెబుతున్నారు. కోలుకున్న రోగులు దీన్ని 'బ్లాక్ ఫంగస్' అని కూడా అంటున్నారు.

కోవిడ్-19 రోగుల్లోకనిపిస్తున్న ఇన్ఫెక్షన్

'మ్యూకర్‌మైకోసిస్' అంటే

మ్యూకోర్‌మైకోసిస్ ఒక అరుదైన ఇన్ఫెక్షన్. సాధారణంగా మట్టిలో, మొక్కల్లో, ఎరువులో కుళ్లిపోతున్న పండ్లు, కూరగాయల్లో కనిపించే మ్యూకర్(బూజు లాంటిది) వల్ల వస్తుంది.

"ఇది అన్నిచోట్లా ఉంటుంది. మట్టిలో, గాల్లో, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల ముక్కులో, చీమిడిలో కూడా ఉంటుంది"ని నాయర్ అన్నారు.

ఇది సైనస్, మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. డయాబెటిక్ రోగులకు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే క్యాన్సర్ లేదా హెచ్ఐవీ లాంటివి ఉన్న రోగులకు ఇది ప్రాణాంతకం కావచ్చు.


మ్యూకర్‌మైకోసిస్‌ సోకినవారిలో 50శాతం మంది మరణిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కోవిడ్‌ 19 రోగుల ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగించే స్టెరాయిడ్లే.

కోవిడ్-19 వల్ల ఊపిరితిత్తుల్లో వచ్చే మంటను స్టెరాయిడ్స్ తగ్గిస్తాయి. శరీరంలోని రోగనిరోధక శక్తి కరోనావైరస్‌తో అతిగా పోరాడ్డం వల్ల వచ్చే కొన్ని నష్టాలను అడ్డుకోవడానికి ఇవి సహకరిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ, డయాబెటిక్ రోగుల్లో, ఇతరుల్లో అవి ఇమ్యూనిటీని తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి.

దానివల్ల మ్యూకోర్‌మైకోసిస్ కేసుల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని కూడా భావిస్తున్నారు.

"డయాబెటిస్ శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. కరోనావైరస్ అది మరింత తగ్గిపోయేలా చేస్తుంది. తర్వాత కోవిడ్-19తో పోరాడ్డానికి సహకరించే స్టెరాయిడ్స్ మ్యూకోర్‌మైకోసిస్‌కు అగ్నికి ఆజ్యంలా పనిచేస్తాయి" అని నాయర్ చెప్పారు.

సెకండ్ వేవ్‌కు ఘోరంగా ప్రభావితమైన ముంబయిలో డాక్టర్ నాయర్ మూడు ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న దాదాపు 40 మంది రోగులను తనను ఇప్పటికే కలిశానని ఆయన చెప్పారు.

"వారిలో చాలా మంది డయాబెటిక్ రోగులు. కోవిడ్-19 వచ్చాక ఇళ్లలోనే కోలుకున్నారు. వారిలో 11 మందికి సర్జరీ చేసి ఒక కన్ను తొలగించాం" అన్నారు.

డిసెంబర్-ఫిబ్రవరి మధ్య మరో ఐదు నగరాల్లోని ఆయన ఆరుగురు కొలీగ్స్ ఇదే ఇన్ఫెక్షన్‌కు సంబంధించి 58 కేసులు వచ్చినట్లు చెప్పారు.

వీరిలో ఎక్కువ మంది రోగులు కోవిడ్ నుంచి కోలుకున్నవారే. కరోనా నుంచి కోలుకున్న 12 నుంచి 15 రోజుల తర్వాత ఈ డాక్టర్లను కలిశారు.

ముంబయిలో బిజీగా ఉండే సియాన్ ఆస్పత్రిలో గత రెండు నెలల్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్‌ 24 కేసులు నమోదయ్యాయి.

"గతంలో ఏడాదికి ఇవి ఆరు కేసులు వచ్చేవి. ఇప్పుడు పెరిగాయి" అని ఆస్పత్రిలోని ఈఎన్‌టీ విభాగం హెడ్ డాక్టర్ రేణుకా బ్రాడూ చెప్పారు.

వీరిలో 11 మంది ఒక కన్ను కోల్పోగా.. మరో ఆరుగురు చనిపోయారు. ఆమె రోగుల్లో ఎక్కువగా మధ్యవయసు డయాబెటిక్ రోగులే ఉన్నారు. కోవిడ్-19 నుంచి కోలుకున్న రెండు వారాలకు వాళ్లకు ఈ ఫంగస్ వచ్చింది.

"మాకు ఇక్కడ ఇప్పటికే వారానికి రెండు మూడు కేసులు వస్తున్నాయి. మహమ్మారి సమయంలో ఇదొక పీడకలలా ఉంది" అని ఆమె నాతో అన్నారు.

ఇక బెంగళూరులోని డాక్టర్ రఘురాజ్ హెగ్డే కంటి వైద్య నిపుణులు. గత 2 వారాల్లో తన దగ్గరకు 19 కేసులు వచ్చాయని ఆయన కూడా చెప్పారు. వారిలో ఎక్కువమంది యువతీయువకులే.

"కొందరు ఎంత జబ్బుపడ్డారంటే మేం వాళ్లకు ఆపరేషన్ కూడా చేయలేకపోయాం" అన్నారు.

కరోనా తర్వాత వస్తున్న ఇన్ఫెక్షన్

గత ఏడాది ఫస్ట్ వేవ్ సమయంలో వచ్చిన కొన్ని కేసులతో పోలిస్తే, సెకండ్ వేవ్ సమయంలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ తీవ్రత, వ్యాపిస్తున్న వేగం తమకు ఆశ్చర్యం కలిగిస్తోందని డాక్టర్లు అంటున్నారు.

ముంబయిలో గత రెండేళ్లలో తాను పది కేసులకు మించి చూడలేదని, ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉందని డాక్టర్ నాయర్ చెప్పారు.

బెంగళూరులో పదేళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ హెగ్డే తనకు ఏడాదికి ఇవి రెండు మూడు కేసులకు మించి రాలేదని అన్నారు.

ఫంగల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నవారికి సాధారణంగా, ముక్కు దిబ్బడ, ముక్కులో రక్తస్రావం, కళ్లు వాపు, నొప్పిగా ఉండడం. కనురెప్పలు బరువుగా ఉండడం, కళ్లు మసకబారి, చివరికి చూపు పోవడం లాంటి లక్షణాలు ఉంటాయి.

ఇది వచ్చిన రోగులకు ముక్కు చుట్టూ చర్మంపై నల్ల మచ్చలు కూడా కనిపిస్తాయి.

చాలా మంది ఆలస్యంగా, ఆల్రెడీ చూపు పోయిన తర్వాత వస్తున్నారని, దాంతో, ఇన్ఫెక్షన్ మెదడుకు రాకుండా, ఆపరేషన్ చేసి ఆ కన్ను తీసేయాల్సి వస్తోందని డాక్టర్లు చెబుతున్నారు.

కొన్ని కేసుల్లో రోగులకు రెండు కళ్లూ కనిపించడం లేదని, అరుదుగా ఈ వ్యాధి వ్యాపించకుండా అడ్డుకోడానికి ఆపరేషన్ చేసి రోగుల దవడ ఎముక కూడా తీసేయాల్సి వస్తోందని అంటున్నారు.

దీనికి నరానికి వేసే యాంటీ ఫంగల్ ఇంజెక్షన్ తీసుకోవాలి. దానికి ఒక డోసుకు రూ.3500 అవుతుంది. ఈ ఇంజెక్షన్‌ను ఎనిమిది వారాలపాటు రోజూ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్‌ఫెక్షన్ నుంచి ఈ ఇంజెక్షన్ మాత్రమే సమర్థంగా కాపాడగలదు.

"కోవిడ్-19 రోగులు ఈ ఇన్పెక్షన్ రాకుండా, తమను తాము కాపాడుకోవాలంటే ఒకే ఒక అవకాశం ఉంది. వారు చికిత్స సమయంలో, కోలుకున్న తర్వాత స్టెరాయిడ్స్ సరైన డోసులో, తగిన వ్యవధిలో వేసుకునేలా చూసుకోవాలి" అని ముంబయి డయాబెటిక్ నిపుణులు డాక్టర్ రాహుల్ బాక్సీ చెప్పారు.

తను గత ఏడాదిగా దాదాపు 800 మంది డయాబెటిక్ కోవిడ్-19 రోగులకు వైద్యం చేశానని, వారిలో ఎవరికీ ఫంగల్ ఇన్ఫెక్షన్ రాలేదని చెప్పారు.

"రోగి డిశ్చార్జ్ అయిన తర్వాత, వారి షుగర్ లెవల్స్ గురించి డాక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలి" అని బాక్సీ నాకు చెప్పారు.

ఇది పెద్దగా వ్యాపించడం లేదు. అయినా దేశవ్యాప్తంగా మ్యూకర్‌మైకోసిస్ కేసుల సంఖ్య ఎందుకు పెరుగుతోందో చెప్పడం కష్టం అని ఒక ప్రభుత్వ అధికారి చెప్పారు.

"ఈ వైరస్ స్ట్రెయిన్ తీక్షణంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా మంది యువతీయువకులపై ప్రభావం చూపుతోంది" అని డాక్టర హెగ్డే చెప్పారు.

ఆయన దగ్గరకు గత నెలలో ఒక 27 ఏళ్ల రోగి వచ్చారు. ఆయనకు డయాబెటిస్ కూడా లేదు.

"కోవిడ్-19 నుంచి కోలుకున్న రెండు వారాల తర్వాత ఆయనకు ఆపరేషన్ చేసిన మేం, ఒక కన్ను తీసేయాల్సొచ్చింది. అది చాలా బాధాకరం" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Mucormycosis: 'Black fungus' damaging the organs of Covid patients in India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X