ముంబై-న్యూయార్క్ విమానంలో బాంబు కలకలం-ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్...!
ముంబై నుంచి న్యూయార్క్ కు ఈ ఉదయం బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా ఢిల్లీలో ల్యాండ్ అయింది. ముంబై నుంచి బయలుదేరిన కాసేపటికే అందులో బాంబు ఉన్నట్లు ఫోన్ కాల్ రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
అత్యవసరంగా ఢిల్లీలో ల్యాండ్ చేయాలని పైలట్ కు ఆదేశాలు పంపారు. దీంతో చేసేది లేక పైలట్ కూడా దాన్ని ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.

ఉదయం ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్టు నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 119 విమానం న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. కాసేపటికే అందులో బాంబు ఉన్నట్లు కాల్ వచ్చింది. ఆ కాల్ కూడా ఆషామాషీగా కాకుండా ఎక్కడ బాంబు పెట్టారో వివరాలు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన భద్రతా సంస్థలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను అప్రమత్తం చేసి పైలట్ ను ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
దీంతో పైలట్ ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులోని ఐసోలేషన్ రన్ వేపై దాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో ఇందులో ప్రయాణిస్తున్న 239 మంది ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత విమానంలో తనిఖీలు చేపట్టారు. స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత విమానాన్ని న్యూయార్క్ కు పంపాలా వద్దా అన్నది నిర్ధారించనున్నారు.












Click it and Unblock the Notifications