యోగా ఇస్లాంకు వ్యతిరేకం: ముస్లీం లాబోర్డ్, ప్రధాని సన్నిహితుడికి షాక్
జైపూర్: యోగా, సూర్యనమస్కారాలు ఇస్లాంకు వ్యతిరేకమని ముస్లీం పర్సనల్ లా బోర్డ్ ఆదివారం ప్రకటించింది. రాజస్థాన్ రాష్ట్రంలో పాఠశాలల్లో యోగా, సూర్యనమస్కారాలు తప్పనిసరి చేయాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని సదరు బోర్డ్ వ్యతిరేకించింది. ఆదివారం జైపూర్‌లో నిర్వహించిన రెండు రోజుల బోర్డు 24వ వార్షిక సమావేశంలో ఆమోదించిన ప్రకటనలో ఈ అంశాన్ని ఒక భాగంగా చేర్చింది.
రాష్ట్రంలోని పాఠశాలల్లో సూర్యనమస్కారాలు, యోగాను తప్పనిసరి చేయాలన్న నిర్ణయాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బలవంతంగా అమలు చేయాలని చూస్తే అంగీకరించవద్దని ముస్లీం యువతకు పిలుపునిచ్చింది.

అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ చట్ట ఉల్లంఘనకు పాల్పడవద్దని, అలా జరిగితే ఆ సాకుతో ఆరెస్సెస్ వంటి హిందూ సంస్థలు ముస్లింలను జాతి వ్యతిరేకులుగా చిత్రించే కుట్ర చేస్తాయని హెచ్చరించింది. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక హిందుత్వ శక్తులు మైనారిటీలపై తమ అజెండాను రుద్దే ప్రయత్నాలు ముమ్మరం చేశాయని ఆరోపించింది. దీంతో ముస్లింలే కాకుండా క్రైస్తవులు కూడా అభద్రతకు గురవుతున్నారని పేర్కొంది.
సూర్య నమస్కారాలు, యోగా ఇస్లాం వ్యతిరేకమని, రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బోర్డు సహాయ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహీం ఖురేషీ విలేకరులతో చెప్పారు. వీహెచ్‌పీ నేతలు అశోక్ సింఘాల్, ప్రవీణ్ తొగాడియా, సాధ్వి ప్రాచీ వంటివారు మైనారిటీలపై విషంచిమ్మేలా మాట్లాడుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు.
మరోవైపు, గతంలో మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ విద్వేష ప్రసంగాలపై స్పందన కోరగా.. అందులో అలాంటిదేమీ తనకు కనిపించలేదన్నారు. ఇక ప్రధాని సన్నిహితుడైన గుజరాత్ వ్యాపారవేత్త జఫర్ సురేష్ వాలాను బోర్డు సమావేశం నుంచి బలవంతంగా పంపేశారు. అంతకుముందు ప్రధానితో సమావేశమవుదామన్న ఆయన ప్రతిపాదనను తోసిపుచ్చారు.












Click it and Unblock the Notifications