ఆస్తి కోసం.. మరిగే పప్పుచారును తల్లిదండ్రుల మీద పోశాడు
ఢిల్లీ : మానవ సంబంధాలన్ని ఆర్థిక సంబంధాలేనన్న మాటలు ఈమధ్య తరుచూ రచ్చకెక్కుతోన్న ఆస్తుల పంచాయితీలను పరిశీలిస్తే నిజమే అనిపించకమానదు. అన్నదమ్ములు, తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు.. ఇలా ఏ బంధాలైనా ఆస్తుల దగ్గరికొచ్చే సరికి చిన్నాభిన్నమైపోతున్న పరిస్థితి.
చిన్నాభిన్నం మాత్రమేనా! ఆస్తుల కోసం రాచి రంపాన పెట్టడం.. వేధించుకు తినడం.. లాంటి ఘటనలు తరుచుగా వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలోను ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. ఆస్తుల కోసం తల్లిదండ్రులతో గొడవపడుతున్న ఓ కొడుకు.. ఏకంగా పొయ్యి మీద మరుగుతోన్న పప్పు చారును వాళ్ల మొహం మీద కుమ్మరించాడు. కొడుకు దాష్టికానికి ఆ వృద్ధ దంపతులు విలవిల్లాడిపోయారు.

ఢిల్లీలోని పహాడ్ గంజ్ ప్రాంతానికి చెందిన శేష్ నాథ్ వర్మ (69) భార్య ఊర్మిళ (64)తో కలిసి స్థానికంగా ఓ ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతంలో మూడంతస్తుల ఇల్లు కట్టుకుని, గ్రౌండ్ ఫ్లోర్ లో దుకాణం నడుపుతూ అదే ఇంట్లో నివసిస్తున్నాడు. పెద్ద కొడుకు రవీందర్ సోని(38) కూడా భార్యా పిల్లలతో కలిసి అదే ఇంట్లో ఉంటున్నాడు.
అయితే ఇల్లు అమ్మేయాలంటూ 2009నుంచి తల్లిదండ్రులతో పేచీకి దిగడం మొదలుపెట్టాడు రవీందర్ సోని. రకరకాలుగా తల్లిదండ్రులను వేధిస్తోన్న రవీందర్.. తల్లిదండ్రులను ఇంట్లోకి రానివ్వకుండా, దుకాణం తెరవనీయకుండా పలుమార్లు మానసిక క్షోభకు గురిచేశాడు. ఇదే క్రమంలో ఓరోజు మరిగే పప్పుచారును ఇద్దరి మొహాలపై కుమ్మరించాడు. మరోసారి కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు.
కొడుకు హింసకు కోడలు కూడా వత్తాసు పలకడంతో.. వేధింపుల పర్వం మరింత ఎక్కువైంది. దీంతో దిక్కతోచని స్థితిలో కోర్టును ఆశ్రయించి తమ గోడు వెల్లబోసుకున్నారు సదరు వృద్ధ దంపతులు. శేషనాథవర్మ పిటిషన్ పై విచారణ జరుపుతూ వస్తోన్న కోర్టు.. తాజాగా తుది తీర్పు వెలువరించింది.
తల్లిదండ్రుల పట్ల రవీందర్ వ్యవహరిస్తోన్న తీరును తప్పుబడుతూ.. తక్షణం ఇంటిని ఖాళీ చేసి బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించింది. దాంతో పాటు రూ.1000 భృతి ప్రతీ నెల చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. స్థానిక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ... ఢిల్లీ కోర్టులో పిటిసన్ దాఖలు చేశాడు రవీందర్. ఆ మూడంతస్తుల భవనం తన కష్టార్జితం కట్టిందని, ప్రేమతో తల్లిదండ్రుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించానని రవీందర్ వాదిస్తున్నాడు.












Click it and Unblock the Notifications