కేజ్రీ దారిలో: ముద్దు పెట్టిన వ్యక్తిని కలవనున్న నగ్మా
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్ లోకసభకు పోటీ చేస్తున్న ప్రముఖ నటి నగ్మా ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ దారిలో నడువనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రచారం చేస్తుండగా ఓ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే నగ్మాను బహిరంగంగా ముద్దు పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో యువకుడు ఆమెను తాకాడు.
తనను ఎమ్మెల్యే ముద్దు పెట్టుకున్న తర్వాత ఆమె అక్కడి నుండి అసహనంతో వెళ్లిపోయారు. మరో సంఘటనలో తనను తాకిన యువకుడి చెంప చెల్లు మనిపించారు నగ్మా. అయితే, ఇప్పుడు ఆమె కేజ్రీవాల్ దారిలో నడవనున్నారు. తనను ముద్దు పెట్టుకున్న నాయకుడిని నగ్మా కలుస్తారట.

తాను కాంగ్రెసు పార్టీలో ఉన్నానని, కాంగ్రెసు పార్టీ గాంధీమార్గంలో నడుస్తోందని, అందుకే తాను అతనిని కలిసి క్షమిస్తానని నగ్మా చెప్పారన్నారు. తమ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కూడా అతనిని కలవాలని సూచించారని చెప్పారు. కాంగ్రెసు విద్వేషపూరిత రాజకీయాలు చేయదని, ప్రేమతో రాజకీయాలు చేస్తోందన్నారు.
కాగా, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి అంత సీను లేదని నగ్మా అన్నారు. మీరట్‌లో ఆమె మాట్లాడుతూ.. మోడీకి అంత ఆదరణ ఉంటే వారణాసి లాంటి సురక్షిత స్థానం నుంచి కాకుండా మరో స్థానం నుంచి పోటీ చేసి ఉండేవారని అభిప్రాయపడింది. తనకు కాంగ్రెస్ అధిష్ఠానం సీటు కేటాయించిందని, ఏ స్థానం నుంచి అభ్యర్థులు గెలుస్తారో అదే స్థానాల్లో పార్టీ అధిష్ఠానం అభ్యర్థులను బరిలో నిలుపుతుందని ఆమె స్పష్టం చేశారు. తన గెలుపు నల్లేరు మీద నడకేనన్నారు.












Click it and Unblock the Notifications