కలకలం: ఆస్పత్రి నుంచి ఐదుగురు కరోనా అనుమానితులు పరారీ
నాగ్‌పూర్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్(కొవిడ్-19) మనదేశంలోనూ వేగంగా వ్యాపిస్తూ ఆందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటి దేశంలో కరోనాబారిన పడి మరణించిన విషయం తెలిసిందే. దేశంలో ఇప్పటి వరకు 83 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరింత కలవరపెట్టే ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది.

ఐదుగురికి కరోనా అనుమానిత లక్షణాలు
కరోనా అనుమానిత లక్షణాలున్న ఐదుగురు రోగులు నాగపూర్ ఆస్పత్రి నుంచి పారిపోయారు. నాగపూర్‌లోని మయో ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. జలుపు, జ్వరం లక్షణాలతోపాటు ఐదుగురు వ్యక్తులు ఆస్పత్రికి రాగా.. వారికి కరోనా అనుమానిత లక్షణాలున్నాయని వైద్యులు తేల్చారు.

స్నాక్స్ అంటూ పరారైన ఐదుగురు బాధితులు
ఆ ఐదుగురు బాధితుల నమూనాలను సేకరించారు. అయితే, స్నాక్స్ తీసుకుంటామంటూ బయటికి వెళ్లిన ఆ ఐదుగురు.. తిరిగి ఆస్పత్రికి రాలేదు. దీంతో వైద్యులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కాగా, ఆస్పత్రి నుంచి పారిపోయిన ఆ ఐదుగురిని గుర్తించామని స్థానిక పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

ఒకరు తిరిగొచ్చినా.. మిగితా నలుగురు పరారీలోనే..
ఐదుగురిలో ఒకరిని పట్టుకుని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మిగితా నలుగురి కోసం గాలిస్తున్నామని సదరు పోలీసు అధికారి తెలిపారు. కాగా, ఆ ఐదుగురిలో ఒకరికి కరోనా నెగిటివ్ వచ్చిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. మరో నలుగురి రిపోర్టులు రావాల్సి ఉందని చెప్పారు. పారిపోయిన వ్యక్తులు కరోనాను మరికొందరికి వ్యాపింపజేసే అవకావం ఉండటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మహారాష్ట్రలో 14 కరోనా పాజిటివ్ కేసులు.. 30 వరకు అన్నీ బంద్
కాగా, మహారాష్ట్రలోనూ కరోనా అనుమానిత కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముంబై, నవీ ముంబై, థానే, నాగపూర్, పింప్రి చించ్వాడ తదితర ప్రాంతాల్లో అనుమానితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. ఆ ప్రాంతాల్లో మార్చి 30 వరకు పాఠశాలలు, కాలేజీలు, థియేటర్లు, జిమ్స్, స్విమ్మింగ్ ఫూల్స్, మాల్స్ మూసివేయాలని సీఎం ఉద్ధవ్ థాక్రే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్రలో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. దేశంలో మొత్తం 83 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, రెండు కరోనా మరణాలు సంభవించాయి.












Click it and Unblock the Notifications