వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లఖ్‌నవూ లులు మాల్‌లో నమాజ్, వీడియో వైరల్.. అసలు ఏం జరిగింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
లూలూ మాల్

లఖ్‌నవూలో లులు మాల్ ప్రారంభమైన కొన్ని రోజులకే వివాదం చోటు చేసుకుంది. ఈ మాల్ లో కొంత మంది నమాజ్ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తున్న ఒక వీడియో వైరల్ అయింది. ఈ చర్యను కొన్ని మత సంస్థలు వ్యతిరేకించడం మొదలుపెట్టాయి.

మాల్‌లోని రెండవ అంతస్థులో ఈ ప్రార్ధనలు చోటు చేసుకున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది.

ఈ వీడియో వైరల్ అయిన తర్వాత సోషల్ మీడియాలో చాలా మంది తీవ్రంగా స్పందించారు. "మాల్ లో నమాజ్ చేసుకునేందుకు అనుమతిస్తే, ఇతర మతాల వారి కార్యక్రమాలు చేసుకునేందుకు కూడా అనుమతివ్వాలి" అని అంటూ చాలా మంది ప్రతిస్పందించారు.

ఇదే డిమాండ్ చేస్తూ గురువారం కొంత మంది మాల్ లోకి ప్రవేశించేందుకు కూడా ప్రయత్నించారు. కానీ, మాల్ బయట ఉన్న పోలీసులు వారిని లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. లఖ్ నవూ లోని సుశాంత్ గల్ఫ్ సిటీ లో ఉన్న లులు మాల్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమాజ్ చేసిన వారికి వ్యతిరేకంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

గురువారం రాత్రి మాల్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుశాంత్ గల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

సెక్షన్ 153 (ఏ) (మత, భాష, కులపరమైన ద్వేషాన్ని రగిల్చే ప్రయత్నం) , సెక్షన్ 295 ఏ (మతవిశ్వాసాలను గాయపరిచే ప్రయత్నం) ప్రకారం కేసును నమోదు చేశారు.

లులు మాల్‌లో జరిగిన ప్రార్థనలతో మాల్ అధికారులు, ఉద్యోగులకు ఎటువంటి సంబంధం లేదని అంతర్గత విచారణలో తేలినట్లు మాల్ యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు.

ఈ సంఘటన తర్వాత మాల్ దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసారు. ముందు జాగ్రత్త చర్యగా మాల్ చుట్టూ అధిక సంఖ్యలో పోలీసులను మోహరించారు. శుక్రవారం లఖ్‌నవూ జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే, వారు మీడియాకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ప్రస్తుతానికి పోలీసులు ఈ ప్రార్ధనలు చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మాల్‌లో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

పోలీసు

https://twitter.com/aninewsup/status/1547628621413896192

మాల్ యాజమాన్యం ఏమంటోంది?

ఈ విషయం గురించి మాల్ యాజమాన్యం బీబీసీతో మాట్లాడేందుకు తిరస్కరించింది. మాల్ జనరల్ మేనేజర్ సమీర్ వర్మ విడుదల చేసిన వీడియోను మాత్రం అందచేసింది.

https://www.youtube.com/watch?v=ZA-U_quDrt0

ఆ వీడియోలో సమీర్ వర్మ , "లులు మాల్ అన్ని మతాలను గౌరవిస్తుంది. ఇక్కడ ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు, ప్రార్ధనలు చేసేందుకు అనుమతించం. మేము మా సిబ్బందికి, భద్రతా సిబ్బందికి తగిన శిక్షణ ఇస్తాం. ఈ మాల్ ను మేము అంతర్జాతీయ షాపింగ్ కేంద్రంగా చేయాలని అనుకుంటున్నాం. ఈ విషయంలో మీడియా మాకు సహకరించాలని కోరుతున్నాం" అని విజ్ఞప్తి చేశారు.

https://twitter.com/aninewsup/status/1546167225018892288

లూలూ మాల్

మాల్‌లో వినియోగదారులు ఏమంటున్నారు?

షాపింగ్, ఔటింగ్ కోసం మాల్ కి విచ్చేసిన వినియోగదారులను ఈ వివాదం గురించి బీబీసీ అడిగింది.

లఖ్‌నవూకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖలీలాబాద్ నుంచి వచ్చిన ఆఖ్మల్ హుస్సేన్‌తో బీబీసీ మాట్లాడింది. ఆయన కేవలం మాల్ సందర్శించేందుకే వచ్చానని చెప్పారు.

మాల్‌లోప్రార్ధనలు చేస్తున్నట్లుగా ఉన్న వీడియో వైరల్ అయిన విషయం గురించి ఆఖ్మల్‌కు తెలియదు. మాల్స్ లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను అనుమతించవచ్చా? "మాల్‌లో ప్రార్ధన చేసుకోవడానికి ఒక గది ఉంటే బాగుంటుంది" అని ఆయన అన్నారు.

నసీబ్ అలీ తన కుటుంబంతో మాల్ చూసేందుకు వచ్చారు. దేశంలోనే అతి పెద్ద మాల్‌ను చూడటానికి వచ్చానని ఆయన చెప్పారు.

ఈయనకు కూడా వైరల్ అయిన వీడియో గురించి తెలియదు.

"ఇక్కడకు షాపింగ్ కోసం వస్తే షాపింగ్ మాత్రమే చేయాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎవరిళ్ళల్లో వారు చేసుకోవాలి. మాల్ లోపల మతపరమైన కార్యక్రమాలు చేయకూడదు. ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉంటేనే అందంగా ఉంటుంది" అని అన్నారు.

లఖ్‌నవూ లోని లులు మాల్ తెరిచి ఐదు రోజులే అయింది. దీపిక ఇప్పటికే మూడు సార్లు ఈ మాల్‌కు వచ్చారు.

"ఇదంతా మనమెక్కడి నుంచి వచ్చాం అనే విషయం పై ఆధారపడి ఉంటుంది. నేనొక షాపును తెరిస్తే, నేను హిందూ మతానికి చెందిన పూజ చేసుకోవచ్చు. ఇదొక లౌకిక దేశం. ఏదైనా చేసుకోవచ్చు. సరదాగా ఇక్కడకు గడిపేందుకు వచ్చేవారు సరదాగా గడుపుతారు.’’

"ఇక్కడకు మాల్‌కు వెళ్లాలనే ఉద్దేశ్యంతోనే వస్తారు. నమాజ్ చేసుకోవడంలో ఇబ్బందేముంది? మాల్ బాగా నడవాలని నేను కూడా ప్రార్ధించాను. ఇక్కడకు అన్ని మతాల వారు వచ్చి సరదాగా గడుపుతున్నారు. ప్రార్ధన చేసుకోవడంలో నాకెటువంటి ఇబ్బంది కనిపించలేదు" అని ఆమె అన్నారు.

లూలూ మాల్

అట్టహాసంగా ప్రారంభమైన లులు మాల్

లఖ్‌నవూ లోని లులు మాల్ ప్రారంభం గురించి వార్తా పత్రికల్లో అనేక పేజీల్లో ప్రకటనలు కనిపించాయి.

ఒక మాల్ ప్రారంభం కోసం స్థానిక, జాతీయ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరగడం లఖ్‌నవూ చరిత్రలోనే అరుదు.

ఈ మాల్‌ను జూలై 10న ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఆ రోజు ఈద్ పండుగ.

ఆయన మాల్‌లో ఎటువంటి ప్రసంగం లేదా ప్రకటన గాని చేయలేదు.

కానీ, ఆయనతో పాటు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు కూడా ఈ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లులు మాల్ చెయిన్ వ్యవస్థాపకుడు యూసఫ్ అలీ స్వయంగా యోగికి 400 మీటర్ల ఎత్తైన రెండతస్తుల మాల్‌ను గోల్ఫ్ కార్ట్ పై తిప్పి చూపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "నేను ఆగస్టు 2017లో ముఖ్యమంత్రిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను. మా ప్రతిపాదన చూసిన తర్వాత మమ్మల్ని పని మొదలుపెట్టుకోమని చెప్పారు. మీకెటువంటి సమస్య రాదని చెప్పారు. మాకు ముఖ్యమంత్రి పై నమ్మకం ఉంది. మీరిప్పుడు చూస్తున్న మాల్ ముఖ్యమంత్రి మద్దతుతో నిర్మించిందే. అదే సమయంలో మేము ఆయననే ఈ మాల్ ను ప్రారంభించమని కోరాం. మా మాటను మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు" అని యోగి ఆదిత్యనాథ్‌కు స్వాగతం పలుకుతూ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Namaz at Lucknow's Lulu Mall, video viral,What actually happened
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X