సీఎం పోస్టుపై ఆశ లేదా ? లోకేష్ జవాబు ఇదే..! డీఎస్సీపై వైసీపీకి కౌంటర్..!
ఇండియా టుడే కాంక్లేవ్ లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఏపీకి సంబంధించిన పలు అంశాలపై సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇచ్చారు. రాబోయే ఐదేళ్లలో ఏపీని టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ అనే 3ఎస్ మంత్రాలను పాటిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు సీఎం కావాలనే ఆశ లేదా? అన్న ప్రశ్నకు.. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావడమే తన ప్రాధాన్యమని లోకేష్ పేర్కొన్నారు.
ఏపీలో ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న వైఎస్సార్సీపీ ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకుంటారా అని రాజ్ దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నకు లోకేష్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. డీఎస్సీ అత్యున్నత నైతిక ప్రమాణాలతో నిర్వహించామని, కొందరు రాజకీయ నిరుద్యోగులు మాత్రమే దీనిపై విమర్శలు చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు డీఎస్సీకీ, ఏపీపీఎస్సీకి కూడా తేడా తెలియదన్నారు. అలాంటి వ్యక్తి తనను ప్రశ్నిస్తున్నారన్నారు. డీఎస్సీపై ఆయన కోర్టులకు కూడా వెళ్లారని, 300 కేసులు కూడా వేశారని, అయినా ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారన్నారు. డీఎస్సీని పూర్తిగా కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించామని లోకేష్ గుర్తుచేశారు.

స్పోర్ట్స్ సర్టిఫికెట్ల విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ఆరోపిస్తోందని, దీనిపై సీబీఐ దర్యాప్తు కూడా అడుగుతుంది కదా అని రాజ్ దీప్ వేసిన ప్రశ్నకు స్పందిస్తూ లోకేష్.. ఆ సర్టిఫికెట్లు ఆయన హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలే ఇచ్చారని గుర్తుచేశారు. స్పోర్ట్స్ కోటాలో ఇవాళ ఉద్యోగాలు పొందిన వారంతా గత ప్రభుత్వ హయాంలో సర్టిఫికెట్లు తీసుకున్న వారేనని తెలిపారు. వాళ్లు అధికారంలో ఉంటే అన్నీ ఒప్పు అని, విపక్షంలో ఉంటే మాత్రం అన్నీ తప్పులుగా కనిపిస్తాయా అని లోకేష్ ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల మీద కోర్టుకు కూడా వెళ్లారని, కోర్టు ఇందులో ఆధారాలు లేవని చెప్పిందన్నారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణకు అంగీకరిస్తారా అని అడిగితే.. మేం తప్పు చేశామని అనుకుంటే వాళ్లు కోర్టుకు వెళ్లొచ్చన్నారు.














Click it and Unblock the Notifications
