బ్రాహ్మణికి నారా లోకేష్ హార్ట్ టచింగ్ మెసేజ్
ఏలూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ 195వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ పాదయాత్ర ఏలూరు జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని నూజివీడు నియోజకవర్గంలో ప్రవేశించారు. మీర్జాపురం మీదుగా నూజివీడు నియోజకవర్గంలో అడుగుపెట్టారు.
నారా లోకేష్ పాదయాత్రకు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. స్థానికులు తమ సమస్యలపై వినతి పత్రాలను అందజేశారు. నూజివీడులో మామిడి రైతులతో సమావేశం అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గొల్లపల్లి, మోర్సపూడి, తుక్కులూరు, నూజివీడు మీదుగా పాదయాత్ర చేశారు.

ఇవ్వాళ ఆయన పెళ్లి రోజు. 2007లో ఆగస్టు 26వ తేదీన తన మేనమామ, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణిని పెళ్లి చేసుకున్నారు లోకేష్. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా విభాగం ప్రతినిధులు లోకేష్-బ్రాహ్మణి దంపతులకు శుభాకాంక్షలను తెలియజేస్తోన్నారు.
పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ ట్విట్టర్ ప్లాట్‌ఫామ్ ద్వారా బ్రాహ్మణిని విషెస్ తెలిపారు. తమ జీవిత ప్రయాణంలో మరో పెళ్లి రోజును జరుపుకుంటున్నామని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్నందున కొన్నిసార్లు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు రావొచ్చని, తాను నిర్వర్తించాల్సిన విధులు దూరంగా ఉంచాయని గుర్తు చేశారు.
తామిద్దరం జంటగా కలిసి ప్రారంభించిన ప్రయాణం ఎంతో విలువైనదని నారా లోకేష్ అభివర్ణించారు. ప్రజా జీవితంలో ఉన్న తనకు భార్యగా ఇస్తోన్న మద్దతు.. ప్రజలకు మరింత సేవ చేయాలనే తన తపనను మరింత పెంచుతోందని పేర్కొన్నారు. నేను దూరంగా ఉన్నా నా హృదయం నీ తోనే ఉంది.. అంటూ ట్వీట్‌ను ముగించారు.












Click it and Unblock the Notifications