వైద్య రంగానికి రూ.50వేల కోట్ల అప్పు హామీ పథకం -ప్రధాని మోదీ National Doctors Day సందేశమిదే
కరోనా విలయ కాలంలో ప్రజల్ని గాలికొదిలేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి సంబంధించి అనూహ్య వ్యూహరచనను సిద్దం చేసింది. గురువారం జాతీయ వైద్యుల దినోత్సం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక విషయాలను వెల్లడించారు. అదే సమయంలో, కొవిడ్ విలయంలో వైద్యుల పాత్రను శ్లాఘించారు. వివరాలివి..
వైద్యులు ఆ భగవంతుడి ప్రతిరూపాలని, మన ప్రాణాలను కాపాడుతున్న దేవుళ్లని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కరోనా మహమ్మారి విపత్తు వేళ విశేష సేవలందించిన డాక్టర్లకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

''కరోనా మహమ్మారితో యావత్ దేశం పోరాడుతున్న వేళ వైద్యులు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఈ పోరాటంలో కొంతమంది వైద్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దేశ ప్రజల కోసం గొప్ప త్యాగం చేసిన వారికి నివాళులర్పిస్తున్నా. 130కోట్ల మంది భారత ప్రజల తరఫున ప్రతి వైద్యుడికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా'' అని ప్రధాని అన్నారు.
స్వాతంత్ర్యం తర్వాత కొన్ని దశాబ్దాల పాటు వైద్య రంగం నిర్లక్ష్యానికి గురైందని మోదీ ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య, మౌలిక సౌకర్యాల కల్పనకు తోడ్పాటు అందించామని తెలిపారు. కరోనా తొలి దశ సమయంలో దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు రూ. 15వేల కోట్ల మేర ప్రత్యేక నిధులను కేటాయించినట్లు ప్రధాని చెప్పారు. ఈ ఏడాది ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు రెట్టింపు చేశామని, రూ. 50వేల కోట్లతో రుణహామీ పథకం ప్రకటించినట్లు పేర్కొన్నారు.

''ఈ రోజు దేశవ్యాప్తంగా ఆసుపత్రుల సంఖ్య పెరిగింది. కొత్తగా ఎయిమ్స్‌లు, మెడికల్ కళాశాలల నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటి వల్ల మారుమూల ప్రాంతాల్లోని వారు డాక్టర్లు కావాలన్న తమ కలను నిజం చేసుకోగలుగుతున్నారు'' అని వెల్లడించారు. వైద్యులపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, కొన్ని సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే వైద్య రంగంలో భారత్ మెరుగ్గానే ఉందని ప్రధాని వివరించారు.












Click it and Unblock the Notifications