డైలామాలో సిద్దూ రాజకీయం : కేజ్రీ షాక్ తో రెంటికి చెడి..
న్యూఢిల్లీ : రాజకీయాలు ఎటుపోయి ఎటొస్తాయో ఊహించడం కష్టమే. అనుకున్నట్లు జరిగితే రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండకపోయినా.. ఊహించని ట్విస్టులు ఎదురైనప్పుడే రాజకీయంగా సందిగ్దంలో పడిపోవాల్సి వస్తుంది. ప్రస్తుతం పంజాబ్ నేత నవజోత్ సింగ్ సిద్దూ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది.
2014 లోక్ సభ ఎన్నికల సందర్భంగా.. ఆమ్ ఆద్మీ కన్వీనర్ కేజ్రీవాల్ ను తన వ్యంగ్యాస్త్రాలతో ఉతికారేసిన సిద్దూ.. రెండేళ్లు గడిచేసరికి ఆయనతో జతకట్టడానికి సిద్దమై అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన తన బీజేపీ రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆప్ తరుపున కేజ్రీవాల్ తనను సీఎం అభ్యర్తిగా ప్రకటిస్తారన్న నమ్మకంతోనే ఆయన ఈ రాజీనామాకు పూనుకున్నారన్న వాదనలు వినిపించాయి.

అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏది కనిపించకపోవడంతో.. సిద్దూ రాజకీయం అటు బీజేపీకి, ఇటు ఆప్ కు కాకుండా పోయిందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. సిద్దూ ఎంట్రీపై ఆప్ నేతల నుంచి వచ్చిన అభ్యంతరం మేరకు సిద్దూను పార్టీలో చేర్చుకోవడంపై కేజ్రీవాల్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సిద్దూ తన భార్యకు కూడా టికెట్ అడుగుతున్నారంటూ.. ఆప్ నేతలు సిద్దూపై విమర్శలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం సిద్దూ రాజకీయ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. కేజ్రీ కూడా సిద్దూను భలే ఇరికించాడన్న కామెంట్స్ వినబడుతుండడం గమనార్హం.












Click it and Unblock the Notifications