మహారాష్ట్రలో బీజేపీకి మద్దతు: కేరళ ఎన్‌సీపీ అభ్యంతరం
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీకి బయట నుంచి మద్దతిస్తామన్న ఎన్‌సీపీ ప్రకటనపై కేరళ ఎన్‌సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సీనియర్ ఎమ్మెల్యే ఏకే శశీంద్రన్ మీడియాకు వెల్లడించారు.
ఈ మేరకు తమ అభిప్రాయాన్ని ఎన్‌సీపీ కేంద్ర నాయకులకు తెలియజేసినట్లు తెలిపారు. ఈ ప్రకటన పార్టీ సిద్దాంతాలకు విరుద్దమని, అవకాశ వాదం అవుతుందని శశీంద్రన్ పేర్కొన్నారు.

దేశంలోని రాష్ట్ర విభాగాలను సంప్రదించకుండా కేంద్ర న్యాయకత్వం ఇలా నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్‌సీపీ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం 'మతతత్వ శక్తులు'లకు దగ్గరయ్యేలా ప్రయత్నిస్తోందని అన్నారు.
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేట్టయితే బయటనుంచి మద్దతిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎన్సీపీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ నేత ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని భావిస్తున్నామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మద్దతిస్తామని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications