అమ్మానాన్న క్షమించండి.. నీట్ వివాదాల నీడలో మరో ప్రాణం బలి!
నీట్ చుట్టూ కొనసాగుతున్న వివాదం నేపథ్యంలోనే మహారాష్ట్రలో మరో దిగ్భ్రాంతికరమైన వార్త వెలుగుచూసింది. నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసినా విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లా కర్ణత్ తాలూకా పరిధిలోని జలాల్ పూర్ గ్రామానికి చెందిన నీట్ విద్యార్థిని అంకితా సంగ్లే ఆత్మహత్య చేసుకుంది. ఆషాడ ఏకాదశికోసం ఆమె తల్లిదండ్రులు, అన్నయ్య పండర్ పూర్‌కు వెళ్లడంతో.. అంకిత ఆ సమయంలో అంకిత ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంది. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో సమీప బంధువులు ఇంటికి వెళ్లి చూడగా.. ఆమె సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది.
ఈ ఘటనపై పోలీసుల నిర్వహించిన విచారణలో అంకిత రాసినట్లు భావిస్తున్న ఓ సూసైడ్ నోట్ లభించింది. నీట్ రీ-ఎగ్జామ్‌లో తాను ఆశించిన స్కోరు సాధించలేకపోవడం, డాక్టర్ కావాలన్న తన కల నెరవేరకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు లేఖలో పేర్కొంది. ఆ సూసైడ్ లేఖలో అంకిత ఇలా రాసుకొచ్చింది. 'అమ్మా నాన్న మీరు నా కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ మీ కలను నెరవేర్చలేకపోతున్నా. అన్నయ్య.. అమ్మా నాన్నను జాగ్రత్తగా చూసుకో. నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి" అని సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

నీట్ రీ-ఎగ్జామ్ లో ఆమె 166 మార్కులు సాధించగా.. కటాఫ్ మార్కులు 177గా ఉన్నాయి. కేవలం 11 మార్కుల తేడాతో ఆమె కటాఫ్ కోల్పోయింది. తాను ఓ సగటు విద్యార్థిని మాత్రమేనని.. కుటుంబ సభ్యుల అంచనాలకు తగ్గట్టుగా జీవించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ తన తల్లిదండ్రులకు, సోదరుడికి ఆ లేఖలో క్షమాపణలు చెప్పింది. తన చావుకు ఎవరినీ నిందించవద్దని కోరింది. కర్ణత్ పోలీసులు ఈ ఘటనపై ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ విషాద ఘటన మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు, దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎన్సీపీ(ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ అంకిత మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎలాంటి పరిస్థితుల్లో వైఫల్యాలకు కుంగిపోవద్దని.. ఆశ కోల్పోకుండా కుటుంబం గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications