NEET-UG 2024: నీట్ లో మూకుమ్మడి అక్రమాలు జరిగాయా ? సుప్రీంకు ఐఐటీ మద్రాస్ నివేదిక..!
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో నీట్ ను మరోసారి నిర్వహించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్రమాల స్థాయిని బట్టి దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలో నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు ఇప్పటికే తేల్చిచెప్పింది. దీంతో కేంద్రం ఐఐటీ మద్రాస్ తో సాంకేతిక పరిశీలన చేయించింది. దీని రిపోర్టును కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది.
ఐఐటీ మద్రాస్ సాంకేతిక పరిశీలన నివేదిక ప్రకారం నీట్ పరీక్షలో ఎలాంటి మూకుమ్మడి అక్రమాలు జరగలేదని తేలింది. ఇదే విషయాన్ని కేంద్రం సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో పేర్కొంది. నీట్ పరీక్ష రాసిన కొందరు విద్యార్ధులకే ప్రత్యేకంగా లబ్ది కలిగేలా ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని మద్రాస్ ఐఐటీ తెలిపింది. సుప్రీం ఆదేశాల మేరకు ఐఐటీ మద్రాస్ నగరాల వారీగా, సెంటర్ల వారీగా పరీక్షలు జరిగిన తీరుపై అధ్యయనం చేసింది.

550-720 మధ్య స్కోరు సాధించిన కొందరు విద్యార్ధుల మార్కుల్లోనే పెరుగుదల కనిపించినట్లు ఈ నివేదిక తేల్చింది. ఇలా ఎక్కువ స్కోరు సాధించిన విద్యార్ధులు కూడా పలు నగరాలకు చెందిన వారిగా గుర్తించారు. సిలబస్ లో 25 శాతం తగ్గింపు దీనికి కారణమై ఉండొచ్చని నివేదిక పేర్కొంది. కాబట్టి మూకుమ్మడిగా నీట్ లో అక్రమాలు జరిగినట్లు చెప్పలేమని అభిప్రాయపడింది. ఈ నివేదికపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనంది. అనంతరం నీట్ కౌన్సెలింగ్ సహా రీటెస్ట్ పై కూడా నిర్ణయం తీసుకునే అవకాశముంది.












Click it and Unblock the Notifications