ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేలకొండపల్లి: ఎస్సై స్రవంతి రెడ్డి కులం పేరుతో బహిరంగంగా దళితులను దూషించారా? లేదా? ఎస్సీ కాలనీ వాసులు ఏమంటున్నారు, పోలీసుల వాదనేంటి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నేలకొండపల్లి

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా స్థానిక దళితులను ఉద్దేశిస్తూ నేలకొండపల్లి ఎస్సై స్రవంతి రెడ్డి కులం పేరుతో దూషించారంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లోని దళిత, ప్రజాసంఘాలు ఎస్సైపై చర్యలకు డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగాయి. ఈ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదులు అందాయి.

అయితే, ఆ వీడియోల్లో కులదూషణ లేదని విచారణలో తేలినట్టు ఖమ్మం జిల్లా పోలీస్ శాఖ స్పష్టం చేసింది. అయితే, కులం ప్రస్తావన లేదన్న పోలీసుల వాదనను సమర్థిస్తున్న వారిలో కూడా ఆ వీడియోలో సదరు మహిళా పోలీస్ అధికారి ఉపయోగించిన భాష పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయిన కొద్ది గంటల వ్యవధిలో మహిళా ఎస్సైతో అసభ్యంగా ప్రవర్తించి, దాడి చేసారన్న ఆరోపణలతో 10 మంది దళిత యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే, కులం పేరుతో బహిరంగంగా దూషించిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఇచ్చిన దరఖాస్తును పోలీసులు స్వీకరించకపోవడం చర్చనీయాంశం అయింది.

నేలకొండపల్లి

గణేష్ నిమజ్జనం రోజు ఏం జరిగింది?

సెప్టెంబర్ 10, 11 తేదీల్లో నేలకొండపల్లి లో గణేశ్ నిమజ్జనోత్సవాలు జరిగాయి. ఈ ఘటన సెప్టెంబర్ 11‌న గ్రామంలోని శివాలయం వద్ద (బొడ్రాయి సెంటర్) జరిగింది.

వీడియోల్లో కనిపిస్తున్న దృశ్యాలను చూస్తే.. గణేశ్ విగ్రహాల ఊరేగింపును ముందుకు తీసుకెళ్లాలంటున్న ఎస్సైతో స్రవంతి రెడ్డిని దళిత కాలనీ యువకులు, స్థానికులు కొంతమంది ఐదు నిముషాల్లో వెళ్లిపోతామంటూ రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఉంది. ఈ క్రమంలోనే ఎస్సై స్రవంతి రెడ్డి అభ్యంతరకర రీతిలో దూషిస్తున్నట్టుగా ఆ వీడియోల్లో కనిపిస్తోంది.

ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలో వీడియోలు ఫేస్‌బుక్, వాట్సప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

విధి నిర్వహణలో ఉన్న మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్‌తో అనుచిత వ్యాఖ్యలు చేసి, భౌతిక దాడికి పాల్పడిన ఘటనలో ఆమె చేతికి గాయమైందని, 10 మంది యువకులను దీనికి బాధ్యులను చేస్తూ కేసులు నమోదు చేసినట్టు ఖమ్మం రూరల్ ఏసీపీ బసవా రెడ్డి సెప్టెంబర్ 12న మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

కొందరు స్వార్థప్రయోజనాల కోసం సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని బసవారెడ్డి తన ప్రకటనలో చెప్పారు. ఈ ఘటన రోజు ఏం జరిగిందన్న అంశంపై బీబీసీ నేలకొండపల్లి ఎస్సీ కాలనీకి వెళ్లి స్థానికులతో మాట్లాడింది. అయితే, ఘటనతో నేరుగా సంబంధమున్న యువకులు కొంతమంది భయంతో కాలనీ నుంచి వెళ్లిపోయారు. కొంత మంది యువకులు పనులకు వేరే ప్రాంతానికి వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు.

నేలకొండపల్లి

''మా పిల్లలకు సర్దిచెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాం. ఎస్సై పై ఎలాంటి దాడి జరగలేదు. ఆమె కులం పేరుతో దూషించలేదుగానీ, అభ్యంతకర భాషలో మాట్లాడారు. ఇది తప్పే. దీనిపై మేము ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయితే మా పిల్లలపై కేసులు నమోదైన విషయం మాకు తెలియదు. ఈ కేసు విషయంలో మా దగ్గరికి ఇప్పటికైతే పోలీసులు ఎవరూ రాలేదు' అని ఎస్సీ కాలనీకి చెందిన చిన్నపంగు వీరస్వామి బీబీసీ తో అన్నారు.

"అభద్రతా భావంతోనే 10 మందిపై కేసులు నమోదు చేసారు. ఆందోళనలు ఎక్కువచేస్తే కేసును స్ట్రాంగ్ చేద్దామన్న ఉద్దేశ్యం కనిపిస్తోంది. బాధితులకు మాత్రం కేసులు లేవని మభ్యపెడుతున్నారు. కేసు నమోదు చేసామని పోలీసులు చెప్పిన విషయం పత్రికల్లో కూడా వచ్చింది. ఇది భాధితులను భయభ్రాంతులకు గురి చేసే చర్య. ప్రజల పై అలాంటి భాష ఉపయోగించడం ఏంటి? అగ్రకులాల వారి ఉత్సవాల్లో ఎస్సై ఇలాగే మాట్లాడగలరా''అని నేలకొండపల్లికి చెందిన పగిడి కత్తుల రాందాసు ప్రశ్నించారు.

ఇదే అంశంపై మాట్లాడేందుకు నేలకొండపల్లి పోలీస్ స్టేషన్‌కు బీబీసీ వెళ్లింది. అయితే, కెమెరాలు లేకుండా ఎలాంటి ఆడియో రికార్డింగులు లేకుండా మాట్లాడటానికి అధికారులు ఒప్పుకున్నారు. బీబీసీ అడిగిన ప్రశ్నలకు కేవలం ముఖాముఖిగా సమాధానాలు ఇచ్చారు.

నేలకొండపల్లి

'డీజే సౌండ్ లతో ఇబ్బంది కలుగుతోందని డయల్ 100కు కాల్స్ వచ్చాయి. స్టేషన్ పరిధిలోని ఇతర గ్రామాల్లో పెట్రోలింగ్ ముగించుకుని వచ్చి, డీజేలు ఆఫ్ చేయించి వాటిని స్టేషన్ కు తరలించాం. డీజే లను ఎందుకు ఆపేస్తున్నారంటూ నన్ను కొంతమంది తాగిన మైకంలో ఉన్న యువకులు చుట్టుముట్టారు. మిస్ బిహేవ్ చేశారు. నా చేతిని విరిచారు. ఈ క్రమంలో చేతికి వాపు వచ్చింది'' అని ఎస్సై స్రవంతి రెడ్డి వివరించారు.

''చదువుకున్నాను, నాకు ఇంగిత జ్ఞానం ఉంది. కులం పేరుతో దూషించలేదు, ఆ రోజున్న పరిస్థితిలో స్వీయరక్షణ కోసం మాటలు అన్నాను. ఈ ఘటనలో సాధారణ మహిళ ఉంటే ఆమెను సపోర్ట్ చేసేవారు. యూనిఫామ్ లో నాకు జరిగిన దానిపై ఎవరూ మాట్లాడటం లేదు'' అని స్రవంతి రెడ్డి అన్నారు.

నేలకొండపల్లి

ఘటనపై భిన్నాభిప్రాయాలు:

కేసులు బూచిగా చూపి ఒత్తిడి పెంచి బహిరంగ కుల దూషణ ఆరోపణల నుండి పక్కదారి పట్టిస్తున్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తుండగా, కొందరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారన్న అభిప్రాయాలు కొంతమంది నుంచి వ్యక్తమవుతున్నాయి.

''ఎస్సై అభ్యంతరకర మాటలు మాట్లాడింది వాస్తవమే, కానీ కులం పేరుతో దూషించలేదు. గుంపులో కొంతమంది నెట్టడం వల్లే అలా అంది. అక్కడ జరిగింది ఒకటి, సోషల్ మీడియాలో వైరల్ అయింది మరొకటి. కొంతమంది నాయకులు స్వలాభం కోసం మా పిల్లల భవిష్యత్తు బలి చేయకూడదు. ఇది తప్పు. డ్యూటీ లో భాగంగానే ఎస్సై అక్కడకు వచ్చారు. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాక తెచ్చుకుంటున్నారు. కేసులు నమోదైన మాట వాస్తవం.అయితే అందులో ఎవరి పేర్లు లేవు. కులం పేరుతో ఏ అధికారి, నాయకుడు దూషించినా ఎవరమూ సమర్థించం, ఆ పోరాటంలో నేనూ పాల్గొంటా'' అని ఎస్సీ కాలనీకే చెందిన మాదాసు ఆదాము అన్నారు.

''ఆమె అభ్యంతరకరంగా ఏమీ మాట్లాడలేదు. ఎస్సీ కులాన్ని దూషించలేదు. ఎస్సైని తప్పు బట్టాల్సిన అవసరం లేదు'' అని ఎస్సీ కాలనీ పంచాయతీ వార్డు మెంబర్ కనక ప్రసాద్ బీబీసీతో అన్నారు.

నేలకొండపల్లి

ముందుగానే కేసులు నమోదు చేసి నిస్సహాయ స్థితిలోకి నెట్టారని సామాజిక ఉద్యమకారులు అంటున్నారు. అణగారిన వర్గాల్లో చట్టం పట్ల నమ్మకం పెంచాల్సింది పోయి, బాధితులపైనే కేసులు నమోదు చేసారన్న విమర్శలు ఖమ్మం పోలీస్‌లపై వివిధ వర్గాల నుంచి వెల్లువెత్తున్నాయి. ''కులం పేరు ఉపయోగించకపోయినా దళితవాడలో డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా ఏ పదం అన్నా అదివారిని అన్నట్టే కదా. పైగా రివర్స్‌ కేసు పెట్టి నిస్సహాయస్థితిలోకి నెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కుల దూషణను ధైర్యంగా చెప్పలేని స్థితి నుండి తమపై నమోదైన కేసులు విత్ డ్రా చేస్తే చాలు అన్న స్థితికి తెచ్చారు. ఇది దుర్మార్గమైన చర్య. ఇందులో విచారణ సరిగా జరగలేదు'' ''ఎస్సై పబ్లిక్‌గా తిడితే కేసులు పెట్టాలి కదా. ముందు ఎఫ్ఐఆర్ నమోదు కావాలి. దళితులైన, సామాన్య ప్రజలైనా, పోలీసులకైనా చట్టం ఎవరికైనా ఒకటే. కేసులను వెంటనే విత్ డ్రా చేసి ఎస్సైపై అట్రాసిటి కేసు నమోదు చేయాలి'' అని ఖమ్మం కు చెందిన న్యాయవాది, సోషల్ యాక్టివిస్ట్ మేకల సుగుణా రావ్ అన్నారు.

''సామరస్యాన్ని దెబ్బతిసే ఇలాంటి ఘటనలు సమాజానికి మంచిదికాదు. ఇది పబ్లిక్ అబ్యూజింగ్. దీనికి వర్తించే సెక్షన్ల ప్రకారం కేసు నమోదు కావాలి. సినిమాల్లో మాదిరి బాధితులనే సాక్షులుగా మార్చారు. ఇలా జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ ఉన్నతాధికారులకు ఉంది. అయితే ఇప్పుడున్న రాజకీయాల్లో పోలీసులు, ఇతర శాఖల అధికారులు స్వతంత్రంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయా అన్నదే ప్రశ్న'' అని ఖమ్మంకు చెందిన ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణులు, సోషల్ డెమెక్రటిక్ ఫోరం కో-కన్వీనర్ డాక్టర్ గోపీనాథ్ బీబీసీతో అన్నారు.

నేలకొండపల్లి

అట్రాసిటి చట్టం ఏం చెబుతోంది ?

దీర్ఘకాలంగా కులం,జాతి,తెగ పేరుతో వివిధ రకాల వివిక్షల కు గురైన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలకు రక్షణ కల్పిస్తూ భారత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) యాక్ట్ -1989 ను రూపొందించింది.

ఈ చట్టం ప్రకారం సామాజిక,ఆర్థిక, సాంస్కృతిక, విద్య, వైద్యం, ఉద్యోగం ఇలా అన్ని రంగాల్లో ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్ష చూపడం నేరం. వారిపట్ల చేతలు, మాటల ద్వారా అసభ్యంగా, అవమానపరిచేలా ప్రవర్తించడం, మాట్లాడటం, సామాజిక బహిష్కరణ చేయడం, అవమానపరిచే ఉద్దేశ్యంతో కూడిన పనులను బలవంతంగా చేయించడాన్ని ఈ చట్టం నేరంగా పరిగణిస్తుంది.

అట్రాసిటి నిరోధక చట్టం ప్రకారం కులం పేరుతో దూషిస్తే గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందని హుజూరాబాద్ కు చెందిన న్యాయవాది దొంత భద్రయ్య బీబీసీతో అన్నారు. నేరం తీవ్రత, నేరానికి పాల్పడ్డ పరిస్థితులను బట్టి శిక్షాకాలం మారే అవకాశం ఉందని తెలిపారు. ఎస్సై స్రవంతి రెడ్డిపై చర్యలు కోరుతూ ఎమ్మార్పీఎస్ కు చెందిన కొంతమంది కార్యకర్తలు కూసుమంచి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. తమ ఫిర్యాదు పై విచారణ జరపాల్సిందిగా కోరారు. అయితే సీఐ ఆ ఫిర్యాదును స్వీకరించలేదు.

''సీఐ ఫిర్యాదు తీసుకునేందుకు మొదట నిరాకరించారు. తర్వాత ఫిర్యాదు తీసుకుంటానుగానీ, దానికి సంబంధించి ఎలాంటి రసీదు ఇవ్వబోమని అన్నారు. ఎకనాలెడ్జ్‌మెంట్ ఇవ్వకపోతే ఫిర్యాదు చేసినట్టుగా ఆధారం ఏముంటుంది" అని నేలకొండపల్లికి చెందిన ఎమ్మార్పీఎస్ జాతీయ కమిటీ ఉపాధ్యక్షుడు వంగూరి ఆనంద రావ్ అన్నారు.

ఎస్సైని విధుల నుంచి తొలగించి చర్యలు తీసుకోవాలని, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని కోరుతూ నేలకొండపల్లితో పాటూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దళిత, ప్రజాసంఘాలు ఆందోళనలు చేపట్టాయి.

నేలకొండపల్లి

పోలీసులు ఏమంటున్నారు:

దళిత సంఘాలు నేలకొండపల్లి ఎస్సైపై ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించిన అంశంపై కూసుమంచి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.సతీశ్‌ను బీబీసీ వివరణ కోరింది.

''ఎస్సై కులం పేరుతో ఎలాంటి దూషణ జరగలేదని, పైగా ఆమెపైనే అసభ్యంగా ప్రవర్తించారని మా విచారణలో తేలింది. అందుకే తప్పుడు ఆరోపణలతో వచ్చిన దళిత సంఘాల ఫిర్యాదును తిరస్కరించాం. వస్తున్నవి తప్పుడు ఆరోపణలు కాబట్టి వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాల్సిన అవసరం లేదు. బాధితులుగా చెబుతున్న వారి పక్షం నుండి ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఫిర్యాదు చేయొద్దని వారిపై మేము ఎలాంటి ఒత్తిడి చేయలేదు'' అని కూసుమంచి సీఐ సతీశ్ వివరించారు.

నేలకొండపల్లి ఘటన వివిధ రూపాల్లో కొనసాగే కుల వివక్ష పై మరోసారి చర్చకు దారితీసింది.

గ్రామంలో అన్ని కులాల వారికి కలిపి ఒకే స్మశాన వాటిక ఉంది. దేవాలయ ప్రవేశం నిరాటంకంగా సాగుతోంది. అయితే దశాబ్దాలుగా దసరా సందర్భంగా నిర్వహిస్తూ వస్తున్న దేవతా విగ్రహాల ఊరేగింపు ఎస్సీ కాలనీ వైపు రాకుండా వెళ్తుండటంపై నేలకొండపల్లి ఎస్సీ కాలనీ వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నేలకొండపల్లి

ఘటనపై విచారణకు ఆదేశించిన పోలీస్ కమిషనర్

ఇటీవల గణేశ్ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా నేలకొండపల్లిలో జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఖమ్మం నగర పోలీస్ కమిషనర్ తెలిపారు.

నేలకొండపల్లిలో ఎస్సై స్రవంతిరెడ్డి దళితులను అవమానపరిచేలా దూషించారని ఆరోపిస్తూ ఎమ్మార్సీఎస్, ఎంఎస్పీ నాయకులు గురువారం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో ఫిర్యాదులో వాస్తవాల పరిశీలించేందుకు విచారణ అధికారిగా అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శబరిష్‌ను నియమించారు. విచారణ అధికారి నివేదిక ఆధారంగా నేలకొండపల్లి ఎస్సై స్రవంతి రెడ్డి పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కమీషనర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Nelakondapally: Did SSI Sravanti Reddy publicly insult Dalits in the name of caste? Or? What do the residents of SC Colony say, what is the argument of the police? - BBC Ground Report
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X