మోడీకి ఓలీ స్పెషల్ గిఫ్ట్ : హిమాలయాల నుంచి తీసుకొచ్చిన నేపాల్ పీఎం
న్యూఢిల్లీ : రెండోసారి భారత ప్రధానిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్రమోడీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, కార్యకర్తలు, శ్రేణులు, నేతలు విష్ చేస్తున్నారు. విదేశీ అధినేతల నుంచి కూడా విషెస్ వస్తున్నాయి. కానీ మోడీకి నేపాల్ ప్రధాని కేపీ ఓలీ ప్రత్యేక బహుమతి అందజేశారు. మోడీపై ఉన్నఅభిమానంతో ఆ గిఫ్ట్ హిమాలయాల నుంచి మరీ తెప్పించారు ఓలీ.
ప్రత్యేక బహుమతి
నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి బిమ్ స్టెక్ సభ్యదేశాల ప్రతినిధులు హాజరయ్యారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా విచ్చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్రపతి అతిథులకు విందు ఏర్పాటుచేశారు. ఇవాళ నరేంద్ర మోడీతో శర్మ సమావేశమయ్యారు. హైదరాబాద్ హౌస్‌లో వివిధ అంశాలపై చర్చించారు. అటు పిమ్మట తాను ప్రత్యేకంగా తీసుకొచ్చిన రుద్రాక్ష మాలను అందజేశారు.

స్వయంగా శివభక్తుడైన మోడీ .. రుద్రాక్ష మాలను చూసి తెగ సంతోష పడిపోయారు. రుద్రాక్ష మాలను ఉన్న విశిష్టతను కూడా ఓలీ వివరించారు. హిమాలయాల్లో మాత్రమే రుద్రాక్షలు లభిస్తాయని పేర్కొన్నారు. ఇక్కడ హిందువుల ప్రత్యేక పూజలతో అవి ఆవిర్భవిస్తాయని సెలవించారు. అంతేకాదు మహాశివుడుకి ఎంతో ప్రీతిపాత్రమైనవి ఈ రుద్రాక్షలని స్పష్టంచేశారు. ఇవీ ధరించే హిందువులంతా ఓం నమ: శివాయ అని ఉచ్చరిస్తామని పేర్కొన్నారు.
మరింత బలోపేతం
మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరవడం సంతృప్తిగా ఉందని చెప్పారు ఓలీ. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు తమ దేశంలో భారత రాష్ట్రపతి పర్యటించాలని ఈ సందర్భంగా మోడీని ఓలి కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సార్క్ కు బదులు బిమ్ స్టెక్ ఏర్పడిన సంగతి తెలిసిందే.
మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి బిమ్ స్టెక్ నేతలంతా హాజరయ్యారు. ఈ క్రమంలోనే తమ దేశంలో మోడీ సహా రాష్ట్రపతి పర్యటించాలని కోరినట్టు సమాచారం. మరి ఓలి ప్రతిపాదనకు మోడీ స్పందించాల్సి ఉంది. ప్రమాణ స్వీకారం తర్వాత విదేశీ పర్యటన ప్రారంభమైన నేపథ్యంలో ... మోడీ నేపాల్ షెడ్యూల్ కూడా ఉంటుందని విశ్వసనీయంగా తెలిసింది.












Click it and Unblock the Notifications