Nepal Floods: నేపాల్ వరదల్లో కవల పిల్లల్ని కాపాడిన నేపాల్ ఆర్మీ.. వైరల్ వీడియో
నేపాల్- టిబెట్ సరిహద్దులోని హిమాలయ ప్రాంతంలో ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. వరదల కారణంగా నేపాల్ లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఈ జల ప్రళయంలో నేపాల్ లో మరణించిన వారి సంఖ్య 547 కు పెరిగినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తవ్వే కొద్దీ మృతదేహాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఆకస్మికంగా వచ్చిన వరదల్లో సుమారు 1600 మంది గల్లంతయ్యారు. ఇక గల్లంతైన వారిలో 288 మంది భారతీయులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. వరదల్లో చిక్కుకుపోయిన వారిలో తెలంగాణకు చెందిన 23 మంది ఎన్ ఆర్ ఐలు ఉన్నారు.

ఇక గల్లంతైన వారికోసం నేపాల్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ ను ముమ్మరం చేసింది. గాలింపు చర్యలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఇద్దరు కవల పిల్లలను జవాన్లు కాపాడారు. మహిళా సైనికులు వారిని ఎత్తుకొని అమ్మలా లాలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న నేపాల్ ఆర్మీ సేవలపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
VIDEO | Nepal floods: Rescued twin children comforted by Nepal Army personnel amid ongoing relief operations. pic.twitter.com/12fLMnjS0f
— Press Trust of India (@PTI_News) August 27, 2026
30 నిమిషాల్లోనే అంతా ఖతం..
నేపాల్- టిబెట్ సరిహద్దులో ఉన్న త్రిశూలి, భోటే కోషి నదులలో సంభవించిన ఆకస్మిక వరదలు భారీ విధ్వంసాన్ని మిగిల్చాయి. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే త్రిశూలి నది నీటి మట్టం 30 అడుగులు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో ఎగువ పరీవాహక ప్రాంతంలో ఉన్న స్వయంచాలిత పర్యవేక్షణ కేంద్రాలు వరదలో కొట్టుకుపోయాయి. అందువల్ల ప్రజలకు సకాలంలో హెచ్చరికలు అందకుండా పోయాయి. అందువల్లనే అంత ప్రాణనష్టం వాటిల్లినట్లు స్పష్టం అవుతోంది. ఇక నేపాల్ కు మరో జలప్రళయం ముప్పు ఉన్నట్లు నేపాల్ పోలీస్ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఆనకట్ట తెగిపోవడంతో జలప్రళయం ముప్పు పొంచి ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు నేపాల్ పోలీస్ శాఖ ట్వీట్ చేసింది. రెస్య్కూ ఆపరేషన్ చేస్తున్న సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications