నేను ఎప్పుడూ బీఫ్ తినలేదు: పూరీ ఆలయం సందర్శన వివాదంపై కమియా జానీ క్లారిటీ
న్యూఢిల్లీ: ప్రముఖ యూట్యూబర్ కమియా జానీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించడం రాజకీయంగా వివాదంగా మారింది. బీఫ్ తినే వ్యక్తిని ఆలయంలోకి ఎలా అనుమతించారంటూ బీజేపీ నేతలు ఒడిశా సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కమియా జానీ స్పందించారు. తాను ఎప్పుడూ బీఫ్ తినలేదని స్పష్టం చేశారు.
పూరీ జగన్నాథుడి ఆశీస్సుల కోసం తాను ఆలయానికి వెళ్లానని.. అలాగే ఆలయ ప్రాముఖ్యతను వివరించాలనుకుంటున్నట్లు కమియా తెలిపారు. తాను ఎప్పుడూ బీఫ్ తినలేదని.. తాను దాన్ని ప్రమోట్ కూడా చేయలేదన్నారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వివరణ ఇచ్చారు. తాను తమ దేశ సంస్కృతి, సంప్రదాయాలను గొప్పగా భావిస్తానని అన్నారు. తాను ఎప్పుడూ భారతీయురాలిగా గర్వపడతానని అన్నారు.

ఇటీవల పూరీ జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న కమియా జానీ.. పలు ఫొటోలను పంచుకున్నారు. ఇక్కడి సాంప్రదాయాలను వివరించే ప్రయత్నం చేశారు. అయితే. కమియా జానీ వెంట బ్యూరోక్రాట్ వీకే పాండ్యన్ కూడా ఉండటంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, సివిల్ సర్వెంట్ అయిన వీకే పాండ్యన్ ఇటీవల ఒడిశాలో అధికార పార్టీ అయిన బీజేడీలో చేరిన విషయం తెలిసిందే. పూరీ ఆలయంలో అందించే మహాప్రసాద్, హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ గురించి ఆయన చెప్పుకొచ్చారు.
బీఫ్ వినియోగం గురించి ప్రమోట్ చేసిన కమియా జానీకి బీజేడీ నేత వీకే పాండ్యన్ ఆతిథ్యం ఇవ్వడంపై బీజేపీ మండిపడుతోంది. హిందువేతరులను ఈ ఆలయంలోకి రానివ్వకూడదనే నిబంధన ఉందని చెబుతున్నారు. ఎంతో ప్రాముఖ్యత గల ఆలయంలోకి ధర్మంపై నమ్మకం లేని వ్యక్తులను ఎలా తీసుకెళతారని ప్రశ్నించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బీఫ్ సర్వ్ చేసే రెస్టారెంట్‌లో కమిజానీ ఉన్న ఫొటోలను కూడా బీజేపీ నేతలు షేర్ చేశారు.
ఈ క్రమంలోనే 35 ఏళ్ల కమియా జానీ తన ఫొటోలు, వీడియోలపై స్పందించారు. కేరళలో ఆ వీడియో తీసినట్లు తెలిపారు. బీఫ్ తరలించే రెండు ట్రక్ డ్రైవర్ల గురించి పేర్కొన్నట్లు చెప్పారు. అయితే, తాను బీఫ్ తినలేదన్నారు. తాను చనా కర్రీ, రైస్ అప్పం, బనానా ఫ్రిట్టర్స్ మాత్రమే తిన్నానంటూ తెలిపారు. తాను ఎప్పుడూ బీఫ్ తినలేదని కమియా స్పష్టం చేశారు. మరోవైపు, బీజేడీ నేతలు ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు. కమియా జానీ హిందూ ఆలయాలపై చేసిన డాక్యుమెంటరీలను ప్రధాని మోడీ సహా పలువురు బీజేపీ నేతలు ప్రమోట్ చేశారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications