న్యూఇయర్: 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లు, హైదరాబాద్ బిర్యానీనే టాప్; కండోమ్స్ కూడా
హైదరాబాద్: కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా శనివారం రోజు రాత్రి దేశ వ్యాప్తంగా లక్షలాది మంది బిర్యానీలనే ఎక్కువగా ఆర్డర్ చేశారని ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. శనివారం రాత్రి 10.25 గంటల సమయానికి దేశ వ్యాప్తంగా 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లను డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. అదే సమయంలో 61వేల పిజ్జాలను కూడా కస్టమర్లకు అందించినట్లు వెల్లడించింది.

3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లలో 75 శాతం హైదరాబాద్ బిర్యానీవే
శనివారం అందిన మూడున్నర లక్షల ఆర్డర్లలో 75.4 శాతం మంది హైదరాబాదీ బిర్యానీనే ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ వెల్లడించింది. హైదరాబాద్ బిర్యానీ తర్వాత లక్నో బిర్యానీ, కోల్‌కతా బిర్యానీలు నిలిచాయి. 14.2 శాతం మంది లక్నో బిర్యానీని, 10.4 శాతం మంది కోల్‌కతా బిర్యానీని తెప్పించుకున్నట్లు తెలిపింది. అత్యధికంగా డెలీవరి చేసిన ఆహార పదార్థాల్లో బిర్యానీయే టాప్‌లో ఉందని పేర్కొంది. శనివారం సాయంత్రం 7.20 గంటల సమయానికే 1.65 లక్షల బిర్యానీలను డెలివరీ చేసినట్లు తెలిపింది.

హైదరాబాద్ బావర్చిలో నిమిషానికి రెండు బిర్యానీ ఆర్డర్లు
కాగా, హైదరాబాద్‌లో బిర్యానీకి అత్యంత ప్రాచుర్యం పొందిన 'బావర్చి' రెస్టారెంట్ శనివారం నాడు నిమిషానికి రెండు బిర్యానీలు డెలివరీ చేయడం గమనార్హం. డిమాండ్ అందుకునేందుకు ఈ రెస్టారెంట్ ఏకంగా 15 టన్నుల బిర్యానీని సిద్ధం చేసినట్లు స్విగ్గీ తెలిపింది. హైదరాబాద్ బిర్యానీకి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా అభిమానులున్న విషయం తెలిసిందే. విదేశాల నుంచి వచ్చినవారు కూడా ఇక్కడ బిర్యానీ రుచి చూడకుండా వెళ్లరనేది అతిశయోక్తి ఏమీకాదు.

న్యూఇయర్ సందర్భంగా పిజ్జాలతోపాటు కండోమ్స్ ఆర్డర్ చేశారు!
ఇది ఇలావుంటే, దేశ వ్యాప్తంగా డోమినోస్ ఇండియాకు చెందిన 61,287 పిజ్జాలను శనివారం డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. శనివారం సాయంత్ంర 7 గంటల సమయానికి 1.76 లక్షల చిప్స్ ప్యాకెట్లు ఆర్డర్ అందినట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ తెలిపింది. ఇక, 9.18 గంటల వరకు 12,344 మంది కిచిడీ ఆర్డర్ చేసినట్లు పేర్కొంది. అంతేగాక, 2757 డ్యురెక్స్ కండోమ్‌లను కూడా డెలివరీ చేసినట్లు వెల్లడించింది.












Click it and Unblock the Notifications