"దిమాగీ నక్సల్స్ అంతమే లక్ష్యం"-రాహుల్ వ్యాఖ్యలకు కేంద్రం కౌంటర్..!
అడవుల్లో నక్సలైట్లు అంతమయ్యారని, కానీ పట్టణాల్లో మేధోపరమైన నక్సల్స్ నుంచి ఇంకా ముప్పు పొంచి ఉందంటూ ప్రధాని మోడీ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గతంలో ఎర్రకోట నుంచి ప్రసంగం చేస్తూ తొలిసారి దిమాగీ నక్సల్స్ (Dimagi Naxals) పదాన్ని ప్రస్తావించిన మోడీ.. తాజాగా తమను ప్రశ్నిస్తున్న విపక్షాల్ని, మేథావుల్ని ఉద్దేశించి అదే పదాన్ని వాడుతున్నారు. దీనిపై స్పందించిన విపక్ష నేత రాహుల్ గాంధీ.. దిమాగీ నక్సల్స్ ఎవరో చర్చించేందుకు తాను సిద్దమని కౌంటర్ ఇచ్చారు.
మీ ముఖాలే అన్నీ చెప్పేశాయి- ప్రధాని చెప్పిన అబద్ధాలను మీరు నమ్మలేదంటూ బస్తర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లతో దీపావళి సంబరాలు చేసుకుంటున్న వేళ మోడీ వ్యాఖ్యలపై రాహుల్ ట్వీట్ చేశారు. ఆయన తమను నక్సలైట్లు అని పిలిచారని, ఎవరు దేశద్రోహులు, ఎవరిని విదేశీ శక్తులు నియంత్రిస్తున్నాయి అనే అంశంపై తనతో చర్చకు రావాలని, ఎప్పుడైనా, ఎక్కడైనా సరే! అంటూ రాహుల్ సవాల్ విసిరారు. నా హామీ ఏమిటంటే-ఆ చర్చ తర్వాత, ఒక్క జవాను ముందు నిలబడే ధైర్యం కూడా ప్రధానికి ఉండదన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఘాటుగా స్పందించారు.

రాహుల్ జీ, సాయుధ మావోయిస్టులను అంతం చేసినందుకు మోదీకి ధన్యవాదాలు తెలపండి అంటూ కిరణ్ రిజిజు ట్వీట్ చేసారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ , వామపక్ష తీవ్రవాదాన్ని, నక్సలిజాన్ని భారతదేశానికి "అతిపెద్ద అంతర్గత భద్రతా ముప్పు"గా పేర్కొన్నారని గుర్తుచేశారు. తమ తదుపరి లక్ష్యం 'దిమాగీ నక్సల్స్' (భావజాలపరమైన నక్సల్స్)ను అంతం చేయడమే అని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. తద్వారా తమను పదే పదే టార్గెట్ చేస్తున్న దిమాగీ నక్సల్స్ ను అంతం చేస్తామంటూ కిరణ్ రిజిజు హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై విపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.














Click it and Unblock the Notifications
