2004లో అలా ప్రధాని పదవి వదులుకున్నా- ఇంత జరిగింది- ఆత్మకథలో సోనియా సంచలనం..!
2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (UPA) తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాని పదవి చేపట్టాలని ఏమాత్రం ఆసక్తి లేని తనను కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఎలా ఒప్పించారో, ఆ తర్వాత తన పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎంత వ్యతిరేకత చూపారో, చివరికి మన్మోహన్ సింగ్ ను ఎలా తాము ప్రధాని చేశామో తన ఆత్మకథలో సోనియా గాంధీ (Sonia Gandhi) వివరించారు. "బిలాంగింగ్- ఎ జర్నీ ఆఫ్ లవ్" పేరుతో రాసిన తన ఆత్మకథలో సోనియా అప్పటి పరిణామాల్ని యథాతథంగా వెల్లడించారు. హార్పర్ కాలిన్స్ ప్రచురించిన ఈ పుస్తకంలోని అంశాల్ని ఇండియన్ ఎక్స్ ప్రెస్ బయటపెట్టింది.
2004 ఎన్నికలకు ముందే ప్రధాని పదవి అంశంపై తన పిల్లలు రాహుల్, ప్రియాంకతో చర్చించానని సోనియాగాంధీ వెల్లడించారు. ఇందులో వారు ప్రధాని పదవి చేపడతారా అని అడిగితే తాను కచ్చితంగా లేదని చెప్పేసినట్లు తెలిపారు. తన అత్త ఇందిరాగాంధీ, భర్త రాజీవ్ గాంధీల దారుణ హత్యలతో తీవ్రంగా ప్రభావితమైన పిల్లలు ప్రధాని పదవిలో ఉండటం వల్ల భద్రతాపరమైన ముప్పు పెరుగుతుందని భావించినట్లు సోనియా తెలిపారు. అప్పట్లో తాను తీసుకున్న నిర్ణయాన్ని పిల్లలతో పాటు కేవలం కొందరు సన్నిహిత
కాంగ్రెస్ నేతలతో మాత్రమే చెప్పినట్లు పేర్కొన్నారు. అలా గత ప్రభుత్వాల వారసత్వాన్ని కొనసాగించే వారు ప్రధానిగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

కానీ 2004 ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నేతలు, కూటమి నాయకులు తనను ప్రధాని పదవి స్వీకరించారని గంటకు పైగా పట్టుబట్టారని, తీవ్రంగా ఒత్తిడి తీసుకువచ్చారని, చివరకు తాను సరే అనగానే, మాట పూర్తి కాకుండానే అంగీకరించినట్లు సంబరాలు చేసుకోవడం ప్రారంభించారన్నారు. దీంతో గది కిటికీ బయట ఉన్న కూతురు ప్రియాంకతో పాటు పక్క గదిలో ఉన్న రాహుల్ కూడా తన దగ్గరకు వచ్చి ప్రశ్నించారన్నారు. ఒత్తిడితో ప్రధాని పదవికి తాను అంగీకరిస్తే, మా పరిస్ధితి ఏంటని రాహుల్ ప్రశ్నించి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు. ప్రియాంక మాత్రం తన నిర్ణయం ఏదైనా, దానికి కట్టుబడి ఉండాలని చెప్పిందన్నారు. ప్రధాని పదవి స్వీకరించకూడదన్న తన నిర్ణయం వెనుక వ్యక్తిగత కారణాలతో పాటు దేశ రాజకీయ భవిష్యత్తుపై ఉన్న ఆందోళన, విదేశీ మూలాల అంశం రాజకీయ వివాదంగా మారుతుందన్న భయం కూడా ఉందన్నారు.

తన విదేశీ మూలాల్ని బీజేపీ, ఆరెస్సెస్ రాజకీయంగా వాడుకుంటాయని, ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ గందరగోళం సృష్టిస్తాయని భావించినట్లు సోనియా తెలిపారు. దీంతో దేశంలో మరో రాజకీయ వివాదం వస్తుందని, తాను ప్రేమించే దేశానికి అలాంటి స్దితి రావడం ఇష్టం లేదన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తనను ప్రధాని పదవికి ఒప్పించేందుకు ఎంపీలు తీవ్రంగా ప్రయత్నించారన్నారు. తన నిర్ణయం మార్చుకోవాలని కోరారని, అయితే తాను ఆ ఉద్దేశంలో లేనన్నారు. తన ప్రసంగం ప్రారంభిస్తూ.. రాజకీయాల్లోకి వచ్చిన ఆరేళ్లలో ప్రధాని పదవి తన లక్ష్యం కాదని తెలిపారు. తన అంతరాత్మ ప్రధాని పదవి తిరస్కరించాలని చెబుతోందన్నారు. ఆ సమయంలో తీవ్ర భావోద్వేగంతో సోనియా ప్రసంగం ఆపేయగా.. ఎంపీలు చుట్టుముట్టి కన్నీళ్లు పెట్టుకున్నారన్నారు. కాసేపు బ్రేక్ తర్వాత తిరిగి వచ్చి మన్మోహన్ సింగ్ పేరును పార్లమెంటరీ పార్టీ నేతగా (ప్రధానిగా) ప్రకటించారు. అలా 2004లో ప్రధాని పదవిని తిరస్కరించడం ద్వారా మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యేందుకు సోనియా మార్గం సుగమం చేశారు.














Click it and Unblock the Notifications
