టోల్ ప్లాజాలో 100 మీటర్ల క్యూ దాటితే ఫీజు ఉండదా? తెలుసుకోండి!
నేషనల్ హైవే టోల్ ప్లాజాల వద్ద వాహనాల క్యూ 100 మీటర్లు దాటితే ఉచితంగా ప్రయాణించవచ్చని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్‌హెచ్‌ఏఐ ఇటీవల దీన్ని పూర్తి అబద్ధమని తేల్చి చెప్పింది.
నేషనల్ హైవేస్ ఫీజు రూల్స్-2008 ప్రకారం క్యూ పొడవు ఆధారంగా టోల్ మినహాయింపు ఇవ్వడానికి ఎలాంటి నిబంధనా లేదని ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టం చేసింది. టోల్ వసూలు కచ్చితంగా నియమాల ప్రకారమే జరుగుతుందని వెల్లడించింది. ఎవరైనా ఈ రూమర్‌ను నమ్మి టోల్ చెల్లించకుండా వెళ్లాలని వాదిస్తే, లేదా టోల్ సిబ్బంది తో గొడవకు దిగితే సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించింది.

గతంలో టోల్ ప్లాజాల వద్ద వెయిటింగ్ సమయానికి మినహాయింపులు ఉండేవి. 2021లో కొన్ని గైడ్‌లైన్స్‌లో క్యూ 100 మీటర్లు దాటితే లేదా సేవా సమయం 10 సెకన్లు మించితే ఉచితంగా పంపాలని ఉండేది. అయితే ఆ నిబంధన సరిగా అమలు కాలేదు. వాహనదారులు ఈ మినహాయింపును దృష్టిలో పెట్టుకుని టోల్ ప్లాజాల వద్ద గొడవలకు పాల్పడ్డారు. దీంతో ఫిర్యాదులు పెరిగాయి. తర్వాత ఎన్‌హెచ్‌ఏఐ ఆ నిబంధనను ఉపసంహరించుకుంది.
ప్రస్తుతం అలాంటి అవకాశం లేదు. టోల్ మినహాయింపు కేవలం ప్రభుత్వం నిర్ణయించిన ప్రత్యేక వర్గాల వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. అవి టోల్ ప్లాజాల వద్ద బోర్డులపైన ప్రదర్శిస్తారు. సాధారణ వాహనదారులు ఫాస్టాగ్ ద్వారా లేదా నగదు రూపంలో టోల్ చెల్లించాల్సి ఉంటుంది. స్థానిక నివాసితులకు లోకల్ పాస్ వంటి సౌకర్యాలు ఉన్నాయి కానీ క్యూ ఆధారంగా ఫ్రీగా వెళ్లే అవకాశం లేదు.
ప్రయాణికులు ఇలాంటి రూమర్లను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, ఎన్ హెచ్ ఏ ఐ నిబంధనలను పాటించాలని ఎన్‌హెచ్‌ఏఐ సూచించింది. గతంలోనూ ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు ఎన్ హెచ్ ఏ ఐ క్లారిటీ ఇచ్చింది. టోల్ ప్లాజా వద్ద ఏదైనా సందేహం ఉంటే అక్కడి అధికారులను అడగాలని, లేదా అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని కోరింది. పొరబాటున కూడా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వాటిని నమ్మొద్దని పేర్కొంది.












Click it and Unblock the Notifications
